అది ముంబై ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్.. నిత్యం రద్దీగా ఉంటుంది. 2023, జూన్ ఒకటో తేదీ ఉదయం 8 గంటల సమయంలో ఎయిర్ పోర్టుకు వచ్చింది ఓ మహిళ. ముంబై నుంచి కోల్ కతా వెళ్లటానికి టికెట్ ముందుగానే బుక్ చేసుకుంది. ఆ మహిళ తన వెంట రెండు బ్యాగులు తీసుకొచ్చింది. నిబంధనల ప్రకారం 15 కేజీల వరకే అనుమతి ఉందని.. రెండో బ్యాగ్ కు అదనపు ఛార్జీలు చెల్లించాలని ఎయిర్ పోర్ట్ సిబ్బంది స్పష్టం చేశారు. రెండో బ్యాగ్ కు డబ్బు చెల్లించనని.. ఆ బ్యాగ్ ను తనిఖీ చేయటానికి కూడా అనుమతించేది లేదంటూ ఆ మహిళ హంగామా చేసింది.
డబ్బు చెల్లించాల్సిందే అని ఎయిర్ పోర్ట్ సిబ్బంది డిమాండ్ చేయటంతో.. ఆ బ్యాగ్ లో బాంబు ఉంది.. కాసేపట్లో పేలిపోతుంది అంటూ వార్నింగ్ ఇచ్చింది. అంతే ముంబై ఎయిర్ పోర్ట్ మొత్తం అలర్ట్ అయ్యింది. పోలీసులు, భద్రతా బలగాలు అందరూ ఆమెను చుట్టుముట్టారు. బాంబు ఉన్నట్లు మహిళ చెప్పిన బ్యాగ్ ను స్వాధీనం చేసుకుని.. తనిఖీ చేశారు. అందులో ఎలాంటి బాంబు కానీ.. కనీసం అనుమానాస్పద వస్తువులు కూడా లేవు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఎయిర్ పోర్టు సిబ్బందిని, ప్రయాణికులను భయాందోళనలకు గురి చేయటం, సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించటం వంటి కారణాలతో ఆ మహిళపై సెక్షన్ 336, సెక్షన్ 505(2) కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. ఆమె ప్రవర్తన విచిత్రంగా.. వింతగా ఉందని చెబుతున్నారు ఎయిర్ పోర్ట్ సిబ్బంది. ఇలాంటి వారి వల్ల విమానంలోని తోటి ప్రయాణికులకు సైతం ఇబ్బంది అంటున్నారు. రెండో బ్యాగ్ కు డబ్బు చెల్లించకుండా ఉండేందుకే.. బ్యాగులో బాంబు ఉందని చెప్పినట్లు ఆ మహిళ చెప్పటం విచిత్రంగా ఉందంటున్నారు పోలీసులు.