ఆఫీసులో ప్రశాంతంగా పని చేసుకుంటున్న సమయంలో... ఉన్నట్టుండి ఒళ్లంతా చెమటలు పడుతున్నాయా? కడుపులో పిసికినట్టు... వాంతి వస్తున్నట్టు అనిపిస్తోందా? గుండెల్లో దడ... ఊపిరి సరిగా అందట్లేదా? అయితే ఇవన్నీ 'ప్యానిక్ అటాక్' లక్షణాలే. ఇలా మీ ఒక్కరికే కాదు... చాలామందిలో కనిపించేవే. అయితే సమస్య చిన్నగా ఉంటే... కంగారు పడనవసరం లేదు. చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ చిట్కాలు ఏవో తెలుసుకుందాం. . .
ప్రమాదం జరగడానికి ఆస్కారం లేకపోయినా.. ఏదో జరుగుతున్నట్లు అనిపిస్తుంది కొంతమందికి. అలాగే ఎవరో తరుముతున్నట్లు భయమేయడం లాంటివి కూడా జరుగుతాయి ఇంకొంతమందికి.ఇదంతా అతితక్కువ సమయంలో.. ఉన్నట్టుండి అనిపిస్తుంది. అలాగే ఈ లక్షణాలు ఒక్కొక్కర్లో ఒక్కోవిధంగా ఉండొచ్చు. ఈ సమస్య మరీ తీవ్రంగా అనిపిస్తే మాత్రం డాక్టర్ని సంప్రదించాలి.
WHO ఏం చెప్తోంది?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదిక ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల 60 లక్షల మంది ప్రజలు డిప్రెషన్తో తో, 3 కోట్ల, 80 లక్షల లమంది యాంగ్జెటీ డిజార్డర్ తో బాధపడుతున్నారు. అలాగే ఒత్తిడిలో పని చేస్తున్న ఎంతోమంది... తమ జీవితకాలంలో ఒకటి, రెండుసార్లు ఈ ప్యానిక్ అటాక్ తో ఇబ్బంది పడుతున్నారని నివేదికలో వెల్లడైంది. ఇలా ఒకటి, రెండుసార్లు అనిపించిన వాళ్లకు ఏం కాలేదు... కానీ రెగ్యులర్ గా వచ్చినవాళ్లలో చాలామందికి 'ప్యానిక్
డిజార్డర్' ఉన్నట్లు నిర్ధారణ అయింది. అలాగే పురుషుల్లో కంటే ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా ఉన్నట్లు మరికొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి..
'ప్యానిక్ అటాక్' లక్షణాలు..
- ఊపిరి సరిగ్గా అందకపోవడం
- పెద్ద ప్రమాదం ముంచుకొస్తున్నట్లు అనిపించడం
- ఉక్కపోతగా ఉండటం
- విపరీతంగా చెమటలు పట్టడం
- చలిగా అనిపించి వణుకు పుట్టడం
- వికారం, కడుపులో తిప్పడం
- గుండె వేగం పెరగడం
- ఛాతిలో నొప్పి
- ఏది జరిగినా భ్రమగా అనిపించడం
పరిష్కార మార్గాలు...
- ఈ ప్యానిక్ అటాక్ లక్షణాలు నిమిషాల్లో తగ్గకపోయినా... తరచూ వస్తున్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అప్పుడు. కండిషన్ చూసి... డాక్టర్లు సైకోథెరపీ రిఫర్ చేస్తారు. అవసరమైతే మందులు కూడా వాడాలి.
- ప్రతిరోజూ వ్యాయామం చేయడం ముఖ్యం. దానివల్ల శరీరంలో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. అవి మనిషిని ఆనందంగా ఉండేలా చేస్తాయి.
- మద్యపానం, ధూమపానం, తంబాకు, కెఫిన్ లాంటి వాటికి దూరంగా ఉండాలి.
- రోజూ ఒకే సమయానికి నిద్రపోవాలి. అంతేకాదు... మనసు ప్రశాంతంగా ఉండి, కంటినిండా నిద్రపోతే శారీరక, మానసిక సమస్యలకు దూరంగా ఉండొచ్చు
ఆఫీసులో ఇలా చేయాలి..
- ప్యానిక్ అటాక్ తో పెద్ద ప్రమాదమేమీ లేదని మనసులో అనుకోవాలి.
- లక్షణాలు కనిపిస్తున్నప్పుడు... ఊపిరిని గట్టిగా, మెల్లిగా తీసుకుంటూ వదలాలి.
- రెండు చేతులతో కళ్లు మూసుకోవాలి.
- కూర్చుని చేతులు, కాళ్లతో చిన్నచిన్న వ్యాయామాలు చేయాలి
- పాజిటివ్ ఎనర్జీని పెంచే వస్తువులు, దృశ్యాలను చూడాలి.