
- అబ్దుల్లాపూర్‌మెట్‌లో బర్డ్ ఫ్లూ కలకలం!
- ఒకటే కోళ్ల ఫాంలో వేల సంఖ్యలో కోళ్లు మృతి!
- గుంత తీసి పూడ్చేస్తున్న నిర్వాహకులు
అబ్దుల్లాపూర్‌మెట్, వెలుగు: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో బర్డ్‌ఫ్లూ కలలం రేపుతోంది. స్థానిక కొత్తగూడెంలో కొన్నేండ్లుగా సాయిగణేశ్ పేరుతో పౌల్ట్రీ ఫాం నడుస్తోంది. గత నెల 24 నుంచి ఈ ఫాంలో ప్రతిరోజూ 200 నుంచి 300 కోళ్లు చనిపోతుండడంతో ఫాం ఓనర్ రాజశేఖర్‌రెడ్డికి అనుమానం వచ్చి వెటర్నరీ అధికారులను సంప్రదించాడు. అధికారులు వచ్చి కోళ్ల రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేశారు.
బర్డ్‌ఫ్లూతో కోళ్లు చనిపోతున్నట్లు నివేదిక ఇవ్వడంతో చచ్చిపోయిన కోళ్లతోపాటు బతికి ఉన్న కోళ్లను కూడా జేసీబీ సాయంతో గుంత తవ్వి పూడ్చేసినట్లు తెలిసింది. ఈ విషయమై ఫాం యజమాని రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. వరుసగా కోళ్లు చనిపోవడంతో తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపాడు. సంబంధిత అధికారులను వివరణ కోరేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా స్పందించలేదు. ప్రస్తుతం ఫాంలోని కోళ్లతో పాటు కోడిగుడ్లను ఎవ్వరికీ విక్రయించొద్దని నిర్వాహకులకు సూచించినట్లు సమాచారం.