‘పానిపట్ ‘ సినిమాపై పేచీ

బాలీవుడ్​లో తీసిన మరో హిస్టారికల్​ మూవీ వివాదంలో చిక్కుకుంది. ఇంతకుముందు పద్మావత్​, జోదా అక్బర్​, బాజీరావు మస్తానీ సినిమాలపై చాలా గొడవ నడిచింది. ఆ తర్వాత రాజ్​పుత్​లు, మరాఠాలు అభ్యంతరాలు చెప్పిన సీన్లను తొలగించడమో, లేదా మార్చడమో చేయడంతో రిలీజయ్యాయి. తాజాగా మూడో పానిపట్ యుద్ధం నేపథ్యంలో తీస్తున్న హిందీ సిన్మా ‘పానిపట్’నికూడా వివాదాలు చుట్టుముట్టాయి. అయితే, ఈసారి మన మిత్రదేశమైన అఫ్ఘానిస్థాన్​ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఈ సిన్మా ట్రైలర్ విడుదలవడానికి ముందే అఫ్ఘాన్​ మాజీ రాయబారి షాయిదా అబ్దాలీ ట్విటర్​లో సినిమాపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇండో–అఫ్ఘాన్​ సంబంధాలను దెబ్బతీసేలా తీయవద్దని సూచించారు. సినిమాలో మెయిన్​ క్యారెక్టర్​ అహ్మద్​ షా అబ్దాలీ పాత్ర వేస్తున్న సంజయ్​ దత్​, సినిమా డైరెక్టర్​ అశుతోష్​ గోవారికర్​లు తాము బాధ్యతగా వ్యవహరించామని రీట్వీట్​ చేశారు.

ఈస్టిండియా పాలనకు…

ఇండియాలో ఈస్టిండియా కంపెనీ పాలనకు బీజం వేసిన ఘట్టం ‘మూడో పానిపట్​ యుద్ధం’. ఇది మరాఠా రాజు సదాశివ్​రావు భావు పీష్వాకి, కాందహార్​ (అఫ్ఘానిస్థాన్​) నుంచి వచ్చిన అహ్మద్​ షా అబ్దాలీకి మధ్య పానిపట్​ ప్రాంతంలో జరిగింది. ఈ యుద్ధంలో మరాఠాలు ఓడిపోయారు. ఈ చరిత్రనంతా అశుతోష్​ గోవరికర్​ తెరకెక్కించారు. ఈ నెల అయిదో తేదీన ట్రైలర్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే బాగా ట్రెండింగ్​ అయ్యింది.

48 గంటల్లోనే దాదాపు పాతిక లక్షల మంది ఈ ట్రైలర్​ని చూశారు. విడుదలైన మొదటి పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల 71 లక్షల మంది చూసినట్లుగా నిర్మాతలు చెబుతున్నారు . దీనిలో అబ్దాలీగా సంజయ్​ దత్​, మరాఠా రాజు సదాశివ్​గా అర్జున్​ కపూర్​, ఇతర ముఖ్య పాత్రల్లో కృతి సనన్​, పద్మినీ కొల్హాపురి వంటివాళ్లు నటించారు. అశుతోష్​ గోవరికర్​ తన దర్శకత్వంలోనే తీసిన ఈ సినిమా వచ్చే నెల ఆరో తేదీన రిలీజ్​ కానుంది.

ఈ సినిమాలో అబ్దాలీ పాత్రను నెగెటివ్​గా చూపించారన్న వార్తలు రావడంతో అఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్​తో సమావేశం కావడానికి అనుమతించాల్సిందిగా ఢిల్లీలోని ఎంబసీ అధికారులు కోరారు. ఆధునిక అఫ్ఘానిస్థాన్​కు పునాదులు వేసిన రాజుగా అహ్మద్ షా అబ్దాలీని అక్కడి జనం అభిమానిస్తారు. అలాంటి వ్యక్తిని ‘పానిపట్​’ సినిమాలో కర్కోటకుడిగా చూపించారని ఎంబసీ అభ్యంతరం చెప్పింది. ఈ సినిమాద్వారా అఫ్ఘాన్ ప్రజల ఎమోషన్స్​ను దెబ్బ తీస్తుందని పేర్కొంటూ ప్రకాశ్ జవదేకర్​కు ఓ లెటర్ కూడా రాశారు. రెండు దేశాల మధ్య  ఉన్న ఫ్రెండ్ షిప్ దృష్ట్యా  అబ్దాలీ పాత్రను కించపరుస్తూ  తీయడం కరెక్ట్ కాదని లెటర్​లో పేర్కొన్నారు.

లెటర్​ పరిశీలిస్తున్న కేంద్రం

అఫ్ఘాన్ ఎంబసీ అధికారులు రాసిన లేఖను కేంద్ర ప్రభుత్వం సీరియస్​గా తీసుకున్నట్లు తెలిసింది. అయితే కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేక్ తో ఆఫ్ఘన్ అధికారుల భేటీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ ఇష్యూకు సంబంధించి ‘పానిపట్’ సినిమా టీంతో అధికారులు మాట్లాడుతున్నట్లు తెలిసింది.

 అబ్దాలీ వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపించవద్దు

‘పానిపట్’ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగానే అఫ్ఘానిస్థాన్​లో హాట్ టాపిక్​గా మారింది. అబ్దాలీని యుద్ధోన్మాదిగా చూపిస్తే అది ఆయన వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపించినట్లు అవుతుందని అఫ్ఘానిస్థాన్ మేధావులు అభిప్రాయపడ్డారు. కాబూల్ నుంచి చాలా మంది కవులు, రచయితలు ‘పానిపట్’ డైరెక్టర్ అశుతోష్  గోవర్ కర్ కు ఈ–మెయిల్ కూడా చేసినట్లు తెలిసింది. ‘రెండు దేశాల మధ్య  స్నేహ సంబంధాలు బలపడటానికి  బాలీవుడ్ సిన్మాలు ఎంతగానో కృషి చేశాయి. సంబంధాలను దెబ్బతీసేలా ‘పానిపట్​’ సినిమా ఉండదని భావిస్తున్నాం’ అని ఢిల్లీలో గతంలో అఫ్ఘాన్ రాయబారిగా పనిచేసిన షాయిదా తన ట్విటర్​లో విజ్ఞప్తి చేశారు.

బాలీవుడ్​లో ఫేమస్​

కాబూలీవాలాకి ఇండియాకి బాగా అనుబంధం ఉంది. అయితే, ఈ లింక్​ దాదాపు రెండు తరాల క్రితమే పోయింది. అప్పట్లో కాబూల్​ నుంచి వచ్చిన వడ్డీ వ్యాపారులు లోకల్​గా అప్పులిచ్చి, గడువు ప్రకారంగా వచ్చి వసూలు చేసుకునేవారు. నిజాయితీ, ఎమోషన్స్​, మాట మీద నిలబడడం, నిర్మొహమాటం అనేవి కాబూలీవాలాల లక్షణంగా చెప్పుకునేవారు. డ్రైఫ్రూట్స్ వ్యాపారం ఎక్కువగా చేసేవారు.  వీళ్లనే పఠాన్​, కాబూలీవాలా, ఖాన్​ వగైరా పేర్లతో వ్యవహరిస్తారు. కాబూలీవాలా పేరుతో రవీంద్రనాథ్​ ఠాగూర్​ చిన్న కథ రాయగా, దాని ఆధారంగా అదే పేరుతో హిందీలో సినిమాకూడా తీశారు. పఠాన్​ పాత్రలకు క్యారెక్టర్​ ఆర్టిస్టు ప్రాణ్​ పెట్టింది పేరు. చలియా సినిమాలో పఠాన్​గా, అమితాబ్​ బచ్చన్​కి బాగా పేరు తెచ్చిన జంజీర్​ సినిమాలో షేర్​ ఖాన్​గా ప్రాణ్​ నటించారు. అమితాబ్​ సెకండ్​ ఇన్నింగ్స్​లో పఠాన్​గా నటించిన ‘ఖుదా గవా’కూడా అఫ్ఘానిస్థాన్​ కల్చర్​తోనే ఉంటుంది. తాలిబన్ల దాడి తర్వాత తీసిన కాబూల్​ ఎక్స్​ప్రెస్​, ఇటీవల వచ్చిన జోదా అక్బర్​, కేసరి, పద్మావతి వంటివి అఫ్ఘాన్​తో ముడిపడినవే. బాలీవుడ్​ సినిమాలను అక్కడివాళ్లు చాలా ఇష్టపడతారు.

చరిత్రలో పానిపట్​

పానిపట్​ పేరు ఇండియన్​ హిస్టరీలో చాలా కీలకమైంది. ఈ ప్రాంతానికి మహాభారత కాలం నుంచీ ప్రాధాన్యత ఉంది. పాండవులు రాయబారంలో అడిగిన అయిదు (పానప్రస్థ, సువర్ణప్రస్థ, ఇంద్రప్రస్థ, వ్యాఘ్రప్రస్థ, తిలప్రస్థ) ఊళ్లలో ఇదొకటి. పానప్రస్థనే ప్రస్తుతం పానిపట్​గా పిలుస్తున్నారు. ఇది ఢిల్లీకి ఉత్తరాన 90 కిలోమీటర్ల దూరంలో హర్యానాలోనిది.  ఇక్కడ జరిగిన మూడు యుద్ధాలతో భారతదేశపు రూపురేఖలు మారాయి.  మొఘల్​ సామ్రాజ్య స్థాపనకు, విస్తరణకు, మరాఠాల పతనానికి,  ఈస్టిండియా కంపెనీ పాలనకు పానిపట్​ సాక్ష్యంగా నిలిచింది.

మొదటి పానిపట్​ యుద్ధం : మొఘల్​ సామ్రాజ్యం ఏర్పడ్డానికి దారి తీసింది. ఢిల్లీని పాలిస్తున్న అఫ్ఘాన్​ సుల్తాన్​ ఇబ్రహీం లోడీకి, టర్కో–మంగోలియన్​​ బాబర్​కి మధ్య 1526లో యుద్ధం జరిగింది. దీనిలో లక్షకు పైగాగల లోడీ సైన్యం ఓడిపోయింది.

రెండో పానిపట్​ యుద్ధం :  దీని తర్వాత మొఘల్​ రాజ్యం విస్తరించింది.1556 అక్టోబర్​లో మొఘల్​ రాజు అక్బర్​ని హేము చంద్ర విక్రమాదిత్య ఓడించి ఢిల్లీలో గద్దె దక్కించుకున్నాడు. ఇది జరిగిన నెల్లాళ్లకు పానిపట్​లో రెండు సైన్యాలు తలపడ్డాయి. మొఘల్​ సేన హేము చంద్రను బంధించింది. అక్బర్​ సేనాపతి బైరమ్​ ఖాన్​ దుర్మార్గంగా హేము చంద్ర తలను నరికేసి, కాబూల్​ (అఫ్ఘాన్​)లో ఢిల్లీ దర్వాజాలోనూ, మొండాన్ని పురానా ఖిల్లా (ఢిల్లీ)లోనూ వేలాడదీయించాడు.

మూడో పానిపట్​ యుద్ధం : ఈస్టిండియా కంపెనీ పాలన మొదలైంది. ఔరంగజేబు చనిపోయాక మొఘల్​ రాజ్యం బాగా బలహీనపడింది. మరాఠాలు బాగా పుంజుకున్నారు. తరచు అఫ్ఘాన్​ నుంచి దాడులు జరిగేవి. 1761 నాటికి అఫ్ఘాన్​ సైన్యం పెద్ద ఎత్తున యుద్ధానికి దిగింది.  అహ్మద్​ షా అబ్దాలీకి, మరాఠా రాజు సదాశివ్​ రావు భావు పీష్వాకి మధ్య జరిగిన యుద్ధంలో.. సాటి హిందూ రాజుల నుంచి, సిక్కు రాజుల నుంచి మద్దతు లభించకపోవడంతో అబ్దాలీ గెలిచాడు.  ఈ యుద్ధంతో మరాఠాల పాలన ముగిసిపోగా, ఈస్టిండియా కంపెనీ చిన్న చిన్న రాజ్యాలను తమ గుప్పిట్లోకి తీసుకుని ఇండియాలో స్థిరపడిపోయింది.

హిస్టారికల్​ ఈవెంట్స్​​, బయోగ్రఫీలపై ఇటీవల సినిమాలు తీయడం ఎక్కువైంది. వీటిలో హీరోయిజం లేదా దేశభక్తి కోసం అసలు విషయాల్ని తారుమారు చేస్తున్నారన్న ఆరోపణలు, అభ్యంతరాలు తరచు ఎదురవుతున్నాయి. తాజాగా అశుతోష్​ గోవరికర్​ తీసిన ‘పానిపట్’పై అఫ్ఘానిస్థాన్​ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మోడర్న్​ అఫ్ఘానిస్థాన్​కు పునాదులు వేసిన తమ రాజు అహ్మద్​ షా అబ్దాలీని యుద్ధోన్మాదిగా చూపించారన్నది వాళ్ల అభ్యంతరం.   వచ్చే నెల ఆరున రిలీజయ్యే ఈ చిత్రం ట్రైలర్​ని ఇప్పటికే దాదాపు 4 కోట్ల మంది చూశారు.

ఎవరీ అహ్మద్ షా అబ్దాలీ?

ఆఫ్ఘన్ రాజు నాదిర్ షా 1747లో హత్యకు గురయ్యాడు.  ఈ పరిస్థితుల్లో అహ్మద్ షా అబ్దాలీ అఫ్ఘానిస్థాన్ పాలకుడిగా ప్రకటించుకున్నాడు. అబ్దాలీ అసలు పేరు అహ్మద్ షా దుర్రానీ. అబ్దాలీ తెగకు చెందినవాడు కావడంతో అహ్మద్‌ షా అబ్దాలీగా పాపులరయ్యాడు.  అబ్దాలీ పాలకుడు అయిన తరువాత అఫ్ఘానిస్థాన్ లో కొత్త శకం ప్రారంభమైందన్నది చరిత్రకారులు చెప్పే మాట. అఫ్ఘాన్ సైన్యంలో ఒక సామాన్య సైనికుడిలా ప్రవేశించిన అబ్దాలీ తన ధైర్య సాహసాలతో అప్పటి రాజు నాదిర్ షాని ఆకట్టుకున్నాడు. అబ్దాలీ తెగ రెజిమెంట్​కి కమాండర్ అయ్యాడు. తరువాత కాబూల్, కాందహార్​లను ఆక్రమించుకున్నాడు. పెషావర్ వరకు చేరుకున్నాడు. ఆ తరువాత సింధు నదిని దాటి లాహోర్, సర్ హింద్ ప్రాంతాలను  ఆక్రమించుకున్నాడు. జీవితం అంతా దండయాత్రలతో గడిపిన అహ్మద్ షా అబ్దాలీ 1772 అక్టోబర్​లో కాందహార్ ప్రాంతంలో చనిపోయాడు. ఆయన చనిపోయిన ప్రాంతంలో పెద్ద సమాధి నిర్మించారు.

ఎర్రకోటలో మకాం

ఢిల్లీ నగరంతో అబ్దాలీకి ప్రత్యేక అనుబంధం ఉంది. 1739లో నాదిర్ షా దండయాత్ర చేసినప్పుడు అబ్దాలీ కూడా ఆయన వెంట వచ్చాడు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటలో కొన్ని రోజులు మకాం వేసినట్లు చరిత్రకారుల కథనం.

పాలకుడే కాదు కవి కూడా…..

అబ్దాలీ పాలకుడే కాదు ఓ మంచి కవి కూడా. పష్తో భాషలో ఆయన ఎన్నో కవితలు రాశాడు.  పర్షియన్ భాషపై కూడా ఆయనకు పట్టుందని సాహిత్య పరిశోధకులు చెబుతారు.

అబ్దాలీ సమాధి ఓ దర్గా

అహ్మద్​ షా దుర్రానీ అబ్దాలీ ఇండియాపై నాదిర్​ షాతో కలిసి ఎనిమిదిసార్లు దండెత్తినట్లు చరిత్ర చెబుతోంది. ఆఖరుగా మూడో పానిపట్ యుద్ధంలో సక్సెస్​ కాగలిగాడు. అయినా, నార్తిండియాలోని ఇతర ముస్లిం రాజులతో వేగలేక తిరిగి అఫ్ఘాన్​ వెళ్లిపోయాడు. కాందహార్​లోని అతని సమాధిని అభిమానులు అహ్మద్​ బాబా దర్గాగా భావిస్తారు. అబ్దాలీ అనేది అఫ్ఘాన్​లోని ఒక తెగ. ప్రస్తుతం దుర్రానీ వంశంలో 12వ తరానికి చెందిన మహమ్మద్​ అబూ బకర్​ దుర్రానీ పాకిస్థాన్​లో ఉంటున్నాడు. అబ్దాలీ ప్రొడక్షన్​ పేరుతో డాక్యుమెంటరీలు తీస్తుంటాడు. పాకిస్థాన్​ కేంద్రంగా అబ్దాలీ ఫౌండేషన్​ ఒకటి చురుగ్గా పనిచేస్తోంది.

‘ఫ్రెండ్ షిప్ డ్యాం’

రెండు దేశాల మధ్య  ఫ్రెండ్ షిప్​కు గుర్తుగా హెరాత్  రాష్ట్రంలో ‘సల్మా డ్యాం’ నిర్మించారు. ఇది జల విద్యుత్కేంద్రం. 2016 జూన్ 4వ తేదీన ఈ డ్యాంను అప్పటి అఫ్ఘాన్  ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీ, మన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ‘సల్మా డ్యాం’ పేరును ఆ తరువాత ‘అఫ్ఘాన్–ఇండియా ఫ్రెండ్ షిప్ డ్యాం’గా అక్కడి ప్రభుత్వం మార్చింది.  42 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్ మొత్తం 75 వేల హెక్టార్ల భూమికి సాగునీరు అందిస్తుంది.

1526 నుంచి వలసలు

1526 నుంచి 1858 మధ్య కాలంలో ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారతదేశానికి వలసలు ప్రారంభమయ్యాయి. ఆఫ్ఘన్ లు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వచ్చి సెటిలయ్యారు. ఇలా సెటిలైన వాళ్లలో చాలా మంది ఇక్కడి ప్రజల్లో కలిసిపోయారు. స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ కూడా ఇలా ఆఫ్ఘనిస్థాన్ నుంచి వలస వచ్చిన వారే.

ఇండియా గిఫ్ట్​

అఫ్ఘానిస్థాన్ తో ఉన్న ఫ్రెండ్ షిప్ దృష్ట్యా ఆ దేశానికి పార్లమెంటు బిల్డింగ్ ను ఇండియా కట్టించి ఇచ్చింది. 2007లో ఇండియాకు ఈ ఆలోచన వచ్చింది. అయితే 2015 నాటికి కానీ బిల్డింగ్ నిర్మాణం పూర్తి కాలేదు. ఆఫ్ఘన్ పార్లమెంటు కొత్త బిల్డింగ్ ను అదే ఏడాది డిసెంబర్ లో ప్రధాని నరేంద్ర మోడీ, అప్పటి ఆఫ్ఘన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అష్రఫ్ ఘని ప్రారంభించారు. ఈ బిల్డింగ్ లో అటల్ బిహారీ వాజ్ పేయి గౌరవార్థం ఒక బ్లాక్ కు ఆయన పేరు పెట్టడం విశేషం. మొఘల్, మోడర్న్ ఆర్కిటెక్చర్ ను బిల్డింగ్ నిర్మాణంలో వాడారు. బిల్డింగ్ లో పార్లమెంటు రెండు సభలున్నాయి. దిగువ సభలో 294 సభ్యులుంటారు. ఎగువ సభలో 190 సభ్యులుంటారు.

మొదటి నుంచీ ఇండో–అఫ్ఘాన్​ స్నేహం

సింధు నాగరికత కాలం నుంచి ఇండియా, అఫ్ఘానిస్థాన్​ల మధ్య స్నేహం ఉండేదని చరిత్ర చెబుతోంది. దేశం విడిపోకముందు ఈ రెండూ ఇరుగు పొరుగు దేశాలు. వీటి మధ్య ఇప్పటికీ మంచి సంబంధాలున్నాయి.