బార్డర్లో నిరసనలు కొనసాగిస్తం: రైతులు
బురారీ గ్రౌండ్‌కు వెళ్లాలన్న అమిత్ షా ప్రపోజల్‌కు నో
ఓపెన్ హార్ట్‌తో పిలవాలి.. షరతులతో కాదని కామెంట్..
వరుసగా నాలుగోరోజూ కొనసాగిన నిరసనలు
న్యూఢిల్లీ, వెలుగు/లక్నో: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న రైతులు.. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే ప్రభుత్వం పెట్టే ఎలాంటి షరతులను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. బురారీలోని సంత్ నిరంకారి స్టేడియంలోకి వస్తేనే చర్చలు జరుపుతామని కేంద్రం చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తమను ఓపెన్హార్ట్తో సంప్రదించాల్సిందని, కానీ కండిషన్లు పెట్టిందని చెప్పారు. తాము సింఘు, టిక్రి బార్డర్ల నుంచి బురారీలోని గ్రౌండ్‌కు వెళ్లబోమని తేల్చిచెప్పారు. వ్యవసాయ చట్టాలను విత్ డ్రా చేసుకుని, మద్దతు ధరపై స్పష్టమైన హామీ ఇస్తే చర్చలకు వస్తామన్నారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలోకి వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్ర మంత్రులతో కూడిన హైలెవెల్ టీం సిద్ధంగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది.
నాలుగో రోజూ..
రైతులు.. ఢిల్లీ బార్డర్ నుంచి కదలలేదు. బురారీలోని సంత్ నిరంకారి గ్రౌండ్‌కు వెళ్లకుండా సిటీ ఎంట్రీ పాయింట్లలోనే ఉండిపోయారు. సింఘు, టిక్రి బార్డర్లలో ఆదివారం కూడా నిరసనలు కొనసాగించారు. కనీసం 4 నెలలకు సరిపోయే వంట సామగ్రి తమ వద్ద ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన విరమించేదిలేదని పేర్కొన్నారు. ప్రతి రోజు సమావేశం తర్వాత అధికారికంగా మీడియా ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. రైతుల నిరసనలకు ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ, సహా పలు వర్గాల ప్రజలు, స్వచ్చంద సంస్థల నుంచి మద్దతు లభిస్తోంది. ఇక టిక్రి , సింఘు బార్డర్లలో తమను పరామర్శించేందుకు వచ్చే వారికి రైతులే భోజనం పెడుతున్నారు.
సంఘాలు ఏమన్నాయంటే?
తాము బురారీ గ్రౌండ్‌కు వెళ్లబోమని, ఢిల్లీ బార్డర్లలోనే ఉండాలని నిర్ణయించుకున్నామని భారతీయ కిసాన్ యూనియన్ (దకౌండా) ప్రెసిడెంట్ బుటా సింగ్ బుర్జ్‌గిల్ చెప్పారు. షరతులు లేకుండా చర్చలు జరగాలని కోరుకుంటున్నామని బీకేయూ(కడియన్) ప్రెసిడెంట్ హర్మీత్ సింగ్ కడియన్, భారతీయ కిసాన్ యూనియన్ హర్యానా యూనిట్ ప్రెసిడెంట్ గుర్నమ్ సింగ్ చాధోని తెలిపారు. ‘‘షరతులు పెట్టి చర్చలకు రావాలని ప్రభుత్వం మమ్మల్ని ఆహ్వానించింది. చర్చలకు తగిన వాతావరణాన్ని సృష్టించాలి. కండిషన్లు ఉంటే మేం మాట్లాడం” అని క్రాంతికారి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు దర్శన్ పాల్ చెప్పారు. రైతుల డిమాండ్లను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే.. ముందు కండిషన్లు పెట్టడం మానుకోవాలని ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) చెప్పింది. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్నదే తమ డిమాండ్ అని, అంతకు తక్కువైతే తాము అంగీకరించబోమని భారతీయ కిసాన్ ఏక్తాగ్రహ్ ప్రెసిడెంట్ జోగిందర్ సింగ్ చెప్పారు.
నిర్బంధిస్తరేమో!
మరోవైపు గ్రౌండ్లలో ప్రొటెస్టులు చేసుకునేందుకు అనుమతిస్తామనడంపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ తమను నిర్బంధిస్తారేమోనని డౌట్ పడుతున్నారు. అందుకే చాలామంది బురారీ గ్రౌండ్‌కు వెళ్లలే. అంతకుముందు స్టేడియాలను తాత్కాలిక జైళ్లుగా మార్చేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని పోలీసులు కోరిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
అగ్రి చట్టాలపై మళ్లీ ఆలోచించండి
కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై మళ్లీ ఆలోచించాలని కేంద్రాన్ని ఉత్తరప్రదేశ్ ప్రతిపక్షాలు కోరాయి. ‘‘దేశంలోని రైతులు కోపంతో ఉన్నారు. మూడు అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ చట్టాలను ప్రభుత్వం రీకన్సిడర్ చేస్తే మంచిది” అని సూచించాయి.
కారులోనే కాలిపోయిండు..
రైతుల నిరసనలకు మద్దతుగా వెళ్లిన 55 ఏండ్ల జనక్ రాజ్.. కారులో మంటలు చెలరేగి సజీవ దహనమయ్యాడు. పంజాబ్‌లోని బర్నాలా జిల్లా ధనోలువా గ్రామానికి చెందిన జనక్‌రాజ్.. ట్రాక్టర్లు రిపేర్లు చేస్తుంటాడు. శనివారం ఢిల్లీ బార్డర్లలో రిపేర్లు వచ్చిన ట్రాక్టర్లు బాగు చేయడానికి స్వచ్ఛందంగా వెళ్లాడు. పని పూర్తయ్యాక రాత్రి బహదూర్బాగ్లో కారులో నిద్రపోయాడు. ఏమైందో ఏమో తెలియదుకానీ ఉన్నట్టుండి కారులో మంటలు చెలరేగాయి. దీంతో సజీవంగా దహనమయ్యాడు. అతడి మృతిపై రైతు సంఘాలు సంతాపం తెలిపాయి.
For More News..