హైదరాబాద్ షాక్ : బిర్యానీలో ఎక్స్ ట్రా పెరుగు అడిగాడని.. కస్టమర్ ను కొట్టి చంపిన హోటల్ సిబ్బంది

హైదరాబాద్ షాక్ : బిర్యానీలో ఎక్స్ ట్రా పెరుగు అడిగాడని.. కస్టమర్ ను కొట్టి చంపిన హోటల్ సిబ్బంది

హైదరాబాద్ సిటీ షాక్ అయ్యింది. బిర్యానీ లవర్స్ జీర్ణించుకోలేని విషయం ఇది.  హైదరాబాద్ సిటీ నడిబొడ్డున పంజాగుట్టలో ఉన్న మెరిడియన్ హోటల్ లో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. రెస్టారెంట్ కు వచ్చి బిర్యానీ ఆర్డర్ చేశాడు కస్టమర్ లియాకత్. బిర్యానీతో పాటు రైతా అడిగాడు. ఒక కప్పు రైతా సరిపోదని.. మరో కప్పు పెరుగు కావాలని వెయిటర్స్ ను కోరాడు. ఈ విషయంలో మెరిడియన్ హోటల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు.

బిర్యానీలో రైతా విషయంలో కస్టమర్ లియాకత్.. హోటల్ సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో హోటల్ వెయిటర్స్ కస్టమర్ లియాకత్ పై దాడి చేసి కొట్టారు. చాలా దారుణంగా హోటల్ లో కొట్టారు వెయిటర్లు. గొడవ పెద్దది కావటంతో సమాచారం అందుకున్న పోలీసులు.. హోటల్ కు వచ్చి కస్టమర్ లియాకత్ తోపాటు హోటల్ సిబ్బందిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పోలీసులతో మాట్లాడుతున్న సమయంలో లియాకత్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే పోలీసులు డెక్కన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు కస్టమర్ లియాకత్. దాడి చేసిన కొట్టిన హోటల్ సిబ్బందిని అరెస్ట్ చేశారు పోలీసులు. 

 

డెక్కన్ హాస్పిటల్ దగ్గర మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్ బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఎక్స్ ట్రా పెరుగు అడిగినందుకు హోటల్ సిబ్బంది దాడి చేశారని ఆరోపిస్తున్నారు మృతుని కుటుంబ సభ్యులు.

2023, సెప్టెంబర్ 10వ తేదీ ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది.