నిమ్స్​ ఉద్యోగికి పోలీస్ ​ట్రీట్​మెంట్​

నిమ్స్​ ఉద్యోగికి పోలీస్ ​ట్రీట్​మెంట్​
  •     పేషెంట్ చైన్​ తీశావంటూ చితకబాదిన పంజాగుట్ట పోలీస్​ 
  •     సరిగ్గా విచారణ జరపకుండా చిరుద్యోగిపై ప్రతాపం
  •     ఫిర్యాదుదారిడి జేబులోనే గొలుసు 
  •     తప్పు తెలుసుకుని బాధితుడిని వదిలేసిన పోలీసులు 
  •     ఆందోళన బాటలో అవుట్​సోర్సింగ్​ కార్మికులు 

పంజాగుట్ట, వెలుగు :  నిమ్స్​ హాస్పిటల్​కు వచ్చిన ఓ పేషెంట్​ మెడలోని గోల్డ్​చైన్ ​దొంగతనం చేశావంటూ ఔట్​సోర్సింగ్​ఉద్యోగిపై పంజాగుట్ట పోలీసులు ప్రతాపం చూపించారు. ఫిర్యాదు అందిన వెంటనే సరైన పద్ధతిలో విచారణ జరపకుండా చిరుద్యోగిని పీఎస్​కు​ తీసుకువెళ్లి తమకు తెలిసిన పద్ధతిలో ‘పోలీస్​ ట్రీట్​మెంట్’ ఇచ్చారు. చివరకు ఆ బంగారు గొలుసు ఫిర్యాదుదారుడి జేబులోనే ఉందని తెలుసుకుని అవాక్కయ్యారు. ఆ తర్వాత చేసిన తప్పు తెలుసుకుని బాధితుడికి సారీ చెప్పి పంపారు.

బాధితుడు, నిమ్స్ ​యూనియన్ ​లీడర్ల కథనం ప్రకారం.. నిమ్స్ దవాఖాన ఓల్డ్​ బిల్డింగ్​లో ఎమ్ఆర్ఐ విభాగం ఉంది.  దుండిగల్​కు చెందిన రవికుమార్​ఊపిరితిత్తుల సమస్యతో నిమ్స్​కు రాగా, అతడిని ఎంఆర్ఐ తీయించుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం రవికుమార్​ ఎమ్ఆర్ఐ చేయించుకోవడానికి వెళ్లాడు. ఎంఆర్ఐ సెక్షన్​ రెండు విభాగాలుగా ఉండగా, ఒక రూములో ఎంఆర్ఐ తీసే టెక్నీషియన్స్, మరో రూమ్​లో మెషీన్​ ఉంటుంది. మెషీన్​ రూమ్​లోకి వచ్చే పేషెంట్స్​కు అక్కడ ఉండే అటెండర్​కు జాగ్రత్తలు చెప్పి పడుకోబెట్టి బయటకు వెళ్తాడు.

రవికుమార్​ కూడా మెషీన్​ఉన్న రూమ్​లోకి వచ్చి తన దగ్గరున్న ఫోన్​ను అటెండర్​ లింగంకు ఇచ్చాడు. ఎమ్ఆర్ఐ పూర్తయిన తర్వాత రవికుమార్​ మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసు కనిపించలేదు. దీంతో ‘మెషీన్​రూమ్​లోకి నువ్వు మాత్రమే వచ్చావ్. కచ్చితంగా చైన్​నువ్వే తీసి ఉంటావ్. నా చైన్​నాకు ఇచ్చెయ్’ అంటూ లింగంను నిలదీశాడు. దీంతో  తాను ఫోన్​మాత్రమే తీసుకున్నానని, గొలుసు సంగతి తెలియదని చెప్పాడు.

దీంతో గొలుసు పోయిందని, తనకు లింగంపైనే అనుమానం ఉందని నిమ్స్​సెక్యూరిటీ అధికారులకు రవికుమార్​ ఫిర్యాదు చేశాడు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సీసీ  ఫుటేజీలు పరిశీలించకుండా, ఫిర్యాదుదారుడిని చెక్​ చేయకుండా లింగంను స్టేషన్​కు తీసుకువెళ్లి కొట్టారు. దీంతో అతడు నడవలేని స్థితికి చేరుకున్నాడు. 

ఫిర్యాదుదారుడి జేబులోనే చైన్​ 

గొలుసు పోయిందంటూ ఫిర్యాదు చేసిన రవికుమార్​ జేబులోనే చివరకు చైన్ ​కనిపించింది. లింగంను చితకబాదిన కొద్దిసేపటికి ఎందుకో అనుమానం వచ్చి రవికుమార్ ​జేబులో చెక్​ చేయగా గొలుసు కనిపించింది. దీంతో పోలీసులు షాక్​కు గురయ్యారు. ముందే ఫిర్యాదుదారుడిని జేబులో, ఇతర చోట్ల చెక్​చేస్తే బాగుండేదన్న ఆలోచనలో పడ్డారు. అప్పటికే లింగంను తీవ్రంగా కొట్టడంతో నడవలేని స్థితికి చేరుకున్నాడు.

దీంతో తప్పయిపోయిందని బతిమిలాడారు. ఫిర్యాదుదారుడు రవికుమార్​ను ఇంకోసారి ఇలా చేయొద్దు అని మందలించి పంపేశారు. బాధితుడు యూనియన్ ​లీడర్లకు, కుటుంబసభ్యులకు చెప్పడంతో తీసుకువెళ్లి హాస్పిటల్​లో అడ్మిట్​చేశారు. లింగంకు దెబ్బలు తగిలిన మాట వాస్తవమేనని, ఎమర్జెన్సీలో చికిత్స పొందుతున్నాడని నిమ్స్​ఆర్ఎంవో తెలిపారు. 

పోలీస్​ స్టేషన్​ను ముట్టడిస్తాం 

చేయని నేరానికి పోలీస్​స్టేషన్​కు తీసుకువెళ్లి విచారణ పేరుతో చితకబాదడాన్ని నిమ్స్​లోని సీఐటీయూ యూనియన్ ​లీడర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ ​లీడర్​ వెంకటేశ్​ మాట్లాడుతూ.. నిమ్స్​లో ​ఉద్యోగి లింగంను పోలీస్ స్టేషన్​కు తీసుకువెళ్లేప్పుడు కనీసం తమకు గాని,  ​కాంట్రాక్టర్​కు గాని సమాచారం ఇవ్వలేదన్నారు.

లింగం నడవలేకపోతున్నాడని, అతనికి న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. శనివారం నిమ్స్​ డైరెక్టర్​ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోకపోతే పంజాగుట్ పోలీస్​ స్టేషన్​ను ముట్టడిస్తామన్నారు.

మేం కొట్టలేదు : సీఐ శోభన్​

ఘటనపై పంజాగుట్ట సీఐ శోభన్​ వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. మెసేజ్​ పెట్టగా ‘మేం కొట్టలేదు’ అని రిప్లై ఇచ్చారు.