
ర్యాష్ డ్రైవింగ్ కేసులో భోదన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. డిసెంబర్23 అర్థరాత్రి ప్రజాభవన్ ముందు కారుతో బారికేడ్లను ఢీ కొట్టారు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్ ని లొంగిపొమ్మని చెప్పి పరారయ్యాడు సోహైల్ . తనకు బదులు డ్రైవర్ అబ్దుల్ ని పోలీస్ స్టేషన్ కు పంపించాడు. ప్రమాదం తర్వాత నేరుగా ముంబై వెళ్లిన సోహైల్ అక్కడి నుంచి దుబాయ్ కి పారిపోయాడు. ఈ క్రమంలో సోహైల్ కోసం పంజాగుట్ట పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్ లో ఉన్న సోహైల్ ను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆ రోజు రాత్రి ఏం జరిగింది?
23వ తేదీన అర్ధరాత్రి 2.45 గంటలకు ప్రజాభవన్ ముందున్న బారికేడ్లను సోహెల్ కారు ఢీకొట్టింది. పంజాగుట్ట పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. కారు నడిపింది సోహెల్‌గా గుర్తించారు. బ్రీత్ ఎనలైజ్ టెస్ట్ కోసం పంజాగుట్ట స్టేషన్‌కు తీసుకెళ్లారు. షకీల్ అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు సమాచారం. సోహెల్‌ను కేసు నుంచి తప్పించి.. అతని ఇంట్లో పని చేస్తున్న అబ్దుల్ ఆసిఫ్‌ను నిందితుడిగా చేర్చే ప్రయత్నం చేశారు.
సీసీ టీవీ ఫుటేజీ పరిశీలన
బ్రీత్ ఎనలైజ్ టెస్ట్‌కు తీసుకెళ్తున్న టైమ్‌లో సోహెల్ పారిపోయాడని ప్రచారం జరిగింది. పోలీసులు కేసును తప్పుదోవ పట్టించారన్న విషయం సీపీ శ్రీనివాస్ రెడ్డి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన అంతర్గత విచారణకు ఆదేశించారు. సీపీ ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఎంక్వైరీ చేశారు. ప్రజాభవన్ నుంచి పోలీస్ స్టేషన్ దాకా ఉన్న సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. స్టేషన్‌లోని కెమెరాలను చూశారు. సోహెల్‌ను స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు గుర్తించారు. నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులు సోహెల్‌ను తప్పించి అబ్దుల్ ఆసిఫ్ ను నిందితుడిగా చేర్చినట్లు డీసీపీ విజయ్ కుమార్ కు అర్థమైంది. ఆ రోజు నైట్ డ్యూటీలో సీఐ దుర్గారావు, ఏఎస్ఐ విజయ్‌కాంత్ ఉన్నట్లు గుర్తించారు. కాగా, విచారణ జరుపుతున్న టైమ్‌లో ఇన్స్పెక్టర్ దుర్గారావు అస్వస్థతకు గురికాగా.. అతన్ని కేర్ హాస్పిటల్‌కు తరలించారు. తర్వాత ఇన్స్పెక్టర్ దుర్గారావును సీపీ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు.
ఏ1గా సోహెల్, ఏ2గా అబ్దుల్
నిందితులను కోర్టులో ప్రొడ్యూస్ చేసే టైమ్‌లో సోహె ల్ పేరు ఎఫ్ఐఆర్లో లేదు. అంతర్గత విచారణ తర్వాత రిమాండ్ రిపోర్టులో మాత్రం ఏ1గా సోహెల్‌ను, ఏ2గా అబ్దుల్‌ను చేర్చారు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ మాట్లాడారు. ‘‘ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేశాం. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ కారు డ్రైవ్ చేసినట్లుగా గుర్తించాం. అయితే.. సోహెల్‌కు బదులు అతని ఇంట్లో పనిచేసే అబ్దుల్ ఆసిఫ్ తానే డ్రైవ్ చేసినట్లుగా పోలీసులకు వచ్చి చెప్పాడు. సోహెల్ పరారీలో ఉన్నాడు. మిగిలినవారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించాం’’అని వెల్లడించారు.