జనసేనకు కూకట్ పల్లి టికెట్.. బీజేపీ నేత అసహనం

ఎన్నికల పొత్తులో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గ టికెట్ ను జనసేనకు  కేటాయిస్తున్నారని వస్తున్న ఊహాగానాలు బిజెపి శ్రేణులను నిరుత్సాహానికి గురి చేశాయని మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని శుక్రవారం(అక్టోబర్ 27) సూర్యాపేటలో జరిగిన బీజేపీ జనగర్జన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన  విషయం తెలిసిందే. దీంతో  తెలంగాణ రాష్ట్రానికి బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడం గొప్ప విషయమని.. ఈ సందర్భంగా  ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లోని మేడ్చల్ జిల్లా కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి హరీష్ రెడ్డి పాలాభిషేకం చేశారు.

 అనంతరం  పన్నాల హరీష్ రెడ్డి మాట్లాడుతూ.. బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రకటించిన ఘనత కేవలం నరేంద్ర మోడీకి దక్కుతుందని అన్నారు.. రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న బీసీ నాయకులను కాంగ్రెస్,  బిఆర్ఎస్ పార్టీలు విస్మరించినప్పటికీ  బిజెపి పెద్దపీట వేసిందని అన్నారు.

అయితే,  మల్కాజ్గిరి, కూకట్ పల్లి, శేర్లింగంపల్లి నియోజకవర్గాలలో బిజెపి బలోపేతంగా ఉన్నప్పటికీ... జనసేన నాయకులకు టికెట్లు కేటాయిస్తున్నారని అయన అసహనం వ్యక్తం చేశారు.  పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ కేటాయించినా పార్టీకి కట్టుబడి పని చేస్తామని  పన్నాల స్పష్టం చేశారు.