Rishabh Pant: పంత్ రీఎంట్రీపై సస్పెన్స్.. పాంటింగ్ మాటల వెనుక ద్వంద్వ అర్థాలు

Rishabh Pant: పంత్ రీఎంట్రీపై సస్పెన్స్.. పాంటింగ్ మాటల వెనుక ద్వంద్వ అర్థాలు

కారు ప్రమాదంలో గాయపడి క్రికెట్‌ కు దూరమైన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీఎంట్రీపై సందేహాలు వీడటం లేదు. అదిగదిగో అరుంధతి నక్షత్రం అన్నట్లు.. అదిగదిగో పంత్ అంటున్నారే తప్ప అతని రాక ఎప్పుడు అనేది ఎవరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్‌లో ఆడటానికి పంత్ సిద్ధంగా ఉన్నారని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వెల్లడించారు. అయితే, అదెలా అన్నది మాత్రం తెలియదని తెలిపారు. ఇక్కడ పాంటింగ్ మాటలు ద్వంద అర్థాలనిస్తున్నాయి. పంత్‌పై వారికి నమ్మకం లేకపోగా.. పూర్తి సీజన్ కొనసాగలేడు అనేలా మాట్లాడారు.

అమెరికా వేదికగా జరిగే మేజర్ క్రికెట్ లీగ్ టోర్నీ ఫ్రాంచైజీ వాషింగ్టన్ ఫ్రీడమ్ కోచ్‌గా పాంటింగ్ నియమితులయ్యారు. ఈ క్రమంలో పంత్ ప్రస్తావన రాగా, ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడటానికి రిషబ్ చాలా నమ్మకంగా ఉన్నారని పాంటింగ్ చెప్పుకొచ్చారు. అయితే, అతను ఏ సామర్థ్యంలో అలా అంటున్నారనేది తాము ఖచ్చితంగా చెప్పలేమని తెలిపారు.  

"ఐపీఎల్ 2024లో ఆడటానికి రిషబ్ పంత్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. అయితే అదెలా అన్నది మాత్రం తెలియదు. మీరు సోషల్ మీడియాలో అతన్ని చూసే ఉంటారు. పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. బాగా నడుస్తున్నాడు. కాకపోతే ఐపీఎల్ 2024 ప్రారంభానికి ఇంకో ఆరు వారాల సమయం మాత్రమే ఉంది. అందువల్ల అతను వికెట్ కీపింగ్ చేయగలడా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం. పంత్ మాత్రం ప్రతి మ్యాచ్ ఆడతా, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతా, వికెట్ కీపింగ్ చేస్తా అంటున్నాడు. అతను డైనమిక్ ప్లేయర్.  అతనే మా కెప్టెన్. గతేడాది మేం అతన్ని చాలా మిస్ అయ్యాం. అయితే, ఈ విషయంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు వస్తాయనే దానిపై మేం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం.." అని పాంటింగ్ అన్నారు.

ఫిట్ నెస్‌పై అనుమానాలు!

లిగమెంట్ సర్జరీ జరిగింది కనుక పంత్ మునుపటిలా వేగంగా కదలగలడా! అనేది ఢిల్లీ యాజమాన్యానికి అనుమానంగా మారింది. రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్.. అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డాడు. మంటల్లో కారు పూర్తిగా  దగ్ధమవ్వగా.. చివరి నిమిషంలో పంత్ దాన్ని నుంచి బయటకు దూకాడు. ఈ క్రమంలో పంత్ మోకాలు 180 డిగ్రీలు పక్కకు తిరగ్గా.. లిగమెంట్ సర్జరీ చేయాల్సి వచ్చింది.