
పాపన్నపేట,వెలుగు: పల్లె ప్రగతిలో భాగంగా మూడేళ్ల కింద పాతిన స్తంభాలకు నేటికీ వైర్లు బిగించడం లేదని ముద్దాపూరం సర్పంచ్ దానయ్య మండిపడ్డారు. మంగళవారం పాపన్నపేటలో ఎంపీపీ చందన ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దానయ్య మాట్లాడుతూ గ్రామంలో 18 స్తంభాలు పాతి వదిలేస్తే ఎలా అని కరెంట్ఏఈపై అగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లాపూర్ సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ నెల కింద గాలివానకు పడిపోయిన స్తంభాలను కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ప్రైవేట్ దుకాణాల్లో వరి విత్తనాలు అధిక ధరలకు అమ్ముతున్నా చర్యలు తీసుకోరా..? అని ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్ ఏవోను నిలదీశారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ మండల సభలో పదేపదే అవే సమస్యలు ప్రస్తావిస్తున్నా.. పట్టించుకోక పోతే సభకు ఎందుకు వస్తున్నారని అధికారును ప్రశ్నించారు. వెంటనే సమస్యలు సాల్వ్ చేయాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.