స్పెషల్ ఎట్రాక్షన్‌గా పారా అథ్లెట్లు.. అర్జున అందుకున్న జీవాంజి దీప్తి

న్యూఢిల్లీ: డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ షూటర్‌‌‌‌‌‌‌‌ మను భాకర్‌‌‌‌‌‌‌‌, వరల్డ్ చెస్ చాంపియన్‌‌‌‌ డి. గుకేశ్‌‌‌‌ దేశ అత్యుత్తమ క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌‌‌‌చంద్‌‌‌‌ ఖేల్‌‌‌‌రత్న అందుకున్నారు. ఇండియా మెన్స్‌‌‌‌ హాకీ టీమ్ కెప్టెన్‌‌‌‌ హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ సింగ్‌‌‌‌, పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్‌‌‌‌ ప్రవీణ్ కుమార్‌‌‌‌‌‌‌‌కు కూడా  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాలు స్వీకరించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌‌‌‌లో శుక్రవారం  జరిగిన నేషనల్ స్పోర్ట్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఇండియా పారా అథ్లెట్లు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. 2024కు గాను నలుగురికి ఖేల్‌‌‌‌రత్న, 32 మందికి అర్జున అవార్డులు లభించాయి. అర్జునకు ఎంపికైన వారిలో 17 మంది పారా అథ్లెట్లు ఉన్నారు.

తెలంగాణ వరంగల్‌‌‌‌ జిల్లాకు చెందిన జీవాంజి దీప్తి అర్జున అవార్డు అందుకుంది. పారిస్ పారాలింపిక్స్‌‌‌‌ విమెన్స్ 400 మీటర్ల టీ20 విభాగంలో దీప్తి కాంస్య పతకం గెలిచింది. పారా అథ్లెట్లు అవార్డు అందుకునేందుకు వస్తుండగా కార్యక్రమానికి హాజరైన వారంతా చప్పట్లతో వారిని అభినందించారు. వీరిలో పారాలింపిక్స్‌‌‌‌లో ఇండియాకు తొలి గోల్డ్ అందించిన  80 ఏండ్ల మురళీకాంత్‌‌‌‌ పేట్కర్‌‌‌‌‌‌‌‌ మరింత ప్రత్యేకంగా నిలిచాడు. లైఫ్‌‌‌‌ టైమ్ కేటగిరీలో మురళీకాంత్ అర్జున అందుకున్న పేట్కర్ 1965 కార్గిల్ వార్‌‌‌‌‌‌‌‌లో బుల్లెట్ గాయంతో కాళ్లు పోగొట్టుకున్నాడు. 1972 పారాలింపిక్స్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ గెలిచి చరిత్ర సృష్టించాడు. కాగా,  ఖేల్‌‌‌‌రత్న గెలిచిన వారికి పురస్కారం, రూ. 25 లక్షలు, అర్జున, ద్రోణాచార్య అవార్డీలకు రూ.15 లక్షల ప్రైజ్‌‌‌‌మనీ కూడా లభించింది.