
‘టిల్లు స్క్వేర్’ చిత్రంలో మోడ్రన్ అమ్మాయిగా గ్లామర్ రోల్‌తో ఆకట్టుకున్న అనుపమ పరమేశ్వరన్.. ‘పరదా’ అనే లేడీ ఓరియంటెడ్ మూవీలో డీ గ్లామర్ రోల్ చేస్తోంది. దర్శన రాజేంద్రన్, సంగీత ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకుడు. శుక్రవారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, కాన్సెప్ట్ వీడియోను హీరోయిన్ సమంత, దర్శకులు రాజ్ అండ్ డీకే లాంచ్ చేశారు. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’ అనే శ్లోకంతో మొదలైన కాన్సెప్ట్ వీడియోలో ముఖాన్ని దుస్తులతో కప్పేసిన గ్రామ దేవతను చూపించారు.
దేవత ముఖం నుంచి.. కొంగులతో ముఖాన్ని కప్పుకున్న మహిళల మధ్య అనుపమ లుక్‌ను రివీల్ చేయడం ఆకట్టుకుంది. శ్రీధర్ మక్కువ, పి.వి.శ్రీనివాసులు, విజయ్ డొంకాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ పరిసర గ్రామాల్లో ఎక్కువగా షూటింగ్ చేశారు. మే నుంచి హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్ మొదలవనుంది. ‘మా సినిమా కథ మాత్రమే కాదు, ఒక అనుభవం, ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లే ప్రయాణం’ అని దర్శకనిర్మాతలు తెలియజేశారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.