అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత ప్రధానపాత్రల్లో ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల తెరకెక్కిస్తున్న చిత్రం ‘పరదా’. శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ నిర్మిస్తున్నారు. బుధవారం ఈ మూవీ టీజర్‌ను దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. అనంతరం జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో అనుపమ మాట్లాడుతూ ‘టీజర్ చూస్తుంటే నా పదేళ్ల ప్రయాణం కనిపించింది. చాలా ఎమోషనల్ అయ్యాను. ప్రేక్షకులను అలరించడానికి ఇలాంటి మంచి పాత్రలు చేయాలనే రెస్పాన్స్‌బులిటీ ఫీలయ్యా.
నా కెరీర్‌లోనే ఫేవరేట్ సినిమా ‘పరదా’ కాగా, నా ఫేవరేట్ క్యారెక్టర్ ఇందులో పోషించిన సుబ్బు’. ఇది అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా’ అని చెప్పింది. హీరోయిన్ దర్శన మాట్లాడుతూ ‘ఇలాంటి సినిమా చేయడం చాలా కష్టం. ప్రవీణ్ ఛాలెంజ్‌గా తీసుకుని చాలా హార్ట్‌ఫుల్‌గా తీశారు’ అని చెప్పింది. ఇలాంటి గొప్ప కథని రాసిన దర్శకుడికి థ్యాంక్స్ అని సంగీత చెప్పింది. డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల మాట్లాడుతూ ‘ఇందులో అద్భుతమైన పెర్ఫార్మెన్స్లు చూస్తారు. స్టోరీ ఐడియాలు చాలా ఉంటాయి. కానీ డబ్బు పెట్టే నిర్మాత, కంటెంట్‌ను నమ్మి నటించిన అనుపమ, దర్శన లాంటి వాళ్లు ఉంటేనే ఇలాంటివి బయటకు వస్తాయి. ఈ సినిమా విమెన్ ఒరియెంటెడ్ సినిమాలకి బిగ్ ఓపెనింగ్స్ ఇస్తుంది’ అని చెప్పాడు. నిర్మాత విజయ్ మాట్లాడుతూ ‘ఇది తమ సినిమా అని భావించి అనుపమ, దర్శన, సంగీత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇకపై సినిమాలోని కంటెంట్ మాట్లాడుతుంది. ప్రవీణ్ ప్రాణం పెట్టి పనిచేశాడు. చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. గట్టిగా హిట్ కొడతాం’ అని చెప్పాడు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, నిర్మాత శరత్ మారార్ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.