
Parag Parikh Fund: కరోనా కాలంలో చాలా మంది ప్రజలు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిని రెండవ ఆదాయ మార్గంగా మార్చుకోవాలని ప్రయత్నించారు. ఈ కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి రిటైల్ ఇన్వెస్టర్ల రాక విపరీతంగా కనిపించింది. దీనికి అదనంగా ఐపీవోల రద్దీతో దలాల్ స్ట్రీట్ భారీగా డబ్బు ప్రవాహాన్ని చూసింది. ఇదే సమయంలో కొందరు పెట్టుబడిదారులు ఈక్విటీ, ఎఫ్అండ్ఓ ట్రేడింగ్ కి దూరంగా ఉంటూ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి మార్గాన్ని ఎంచుకున్న సంగతి తెలిసిందే.
అయితే మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లో ప్రధానంగా సెబీ పర్యవేక్షణ కఠినంగా ఉంటుంది. పైగా వీటిని నిర్వహించటానికి అనుభవజ్ఞులైన మేనేజర్లను అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ప్రత్యేకంగా నియమించుకుంటుంటాయి. ఇది పెట్టుబడి పెట్టేవారిపై చాలా వరకు ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి అవసరాలు, రిస్క్ అపటైట్, రాబడి టార్గెట్లు, కాలం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటూ నచ్చిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే వాటిలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లేదా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
ఇప్పుడు మనం పెట్టుబడిదారులకు మంచి రాబడులను అందించిన పరాగ్ పరేక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వాస్తవానికి ఈ స్కీమ్ 2013లో లాంచ్ చేయబడింది. ఈ స్కీమ్ కింద ప్రస్తుతం రూ.88 వేల 005 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఈ స్కీమ్ వార్షికంగా సగటున ఇన్వెస్టర్లకు ఏకంగా 20 శాతం రాబడిని అందించి ఉత్తమ పనితీరుతో ఇన్వెస్టర్లపై డబ్బుల వర్షం కురిపించింది.
ఎవరైనా ఇన్వెస్టర్ ఈ స్కీమ్ కింద గడచిన 10 సంవత్సరాల నుంచి అంటే దాదాపు స్కీమ్ ప్రారంభం నుంచి.. నెలకు రూ.10 వేల చొప్పున SIP రూపంలో పెట్టుబడిని కొనసాగినట్లయితే ప్రస్తుతం వారి పెట్టుబడి మెుత్తం విలువ దాదాపు రూ.43 లక్షలకు చేరుకుని ఉండేది. ఇతర ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ సగటున ఇదే కాలంలో వార్షికంగా 15 శాతం నుంచి 20 శాతం మధ్య రాబడిని అందించాయి. అందుకే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు ఎల్లప్పుడూ దీర్ఘకాలికి పెట్టుబడి వ్యూహం మంచి రాబడులను తెచ్చిపెడుతుందని నిపుణులు చెబుతుంటారు.
ALSO READ : గోల్డ్‌మన్ శాక్స్ మెగా స్టాక్ షాపింగ్.. ఆ రెండు స్టాక్స్ పైనే బెట్టింగ్
SIP అంటే ఏమిటి..?
SIP అంటే సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దీని కింద ప్రజలు తమ డబ్బును ప్రతి నెల ఎంపిక చేసుకున్న తేదీన వారి నిర్ణయించుకున్న మెుత్తాన్ని ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కింద పెట్టుబడిగా పెట్టడం. ఇది వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేస్తుంది. అలాగే దీర్ఘకాలంలో తక్కువ మెుత్తాలను పెట్టుబడిగా పెడుతూ వారి ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన కార్పస్ మెుత్తాన్ని పోగుచేసేందుకు సహాయకారిగా నిలుస్తుంది. అయితే గడచిన కొన్ని వారాలుగా స్టాక్ మార్కెట్లు కరెక్షన్ కి గురవుతున్న వేళ ఫిబ్రవరిలో పెట్టుబడిదారులు తమ ఎస్ఐపీలను నిలిపివేస్తున్న రేటు 122 శాతంగా ఉందని మ్యూచువల్ ఫండ్ సంస్థలు అందించిన వివరాల ప్రకారం వెల్లడైంది. దీంతో మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లోకి పెట్టుబడుల రాక మూడు నెలల కనిష్ఠానికి పడిపోయి రూ.25 వేల 999 కోట్లకు చేరుకుంది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.