పరకాల బరిలో గ్రీన్​ఫీల్డ్​హైవే నిర్వాసిత రైతులు

  •    భూసేకరణ ప్రక్రియ రద్దు 
  •     చేయకపోవడంపై ఆగ్రహం 
  •     భూములను తక్కువ ధరకు తీసుకుంటున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదనే... ​

హనుమకొండ/పరకాల, వెలుగు: గ్రీన్​ ఫీల్డ్​ హైవే భూ నిర్వాసితులు పరకాల నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నారు. నాగ్​పూర్​ -విజయవాడ గ్రీన్​ ఫీల్డ్​ హైవే(ఎన్​హెచ్​ 163 జీ)లో భాగంగా మంచిర్యాల నుంచి వరంగల్ మీదుగా విజయవాడ వరకు హైవే నిర్మించనుండగా..ఈ  మార్గంలో భూములు కోల్పోతున్నవాళ్లంతా నామినేషన్​ వేసేందుకు సిద్ధమవుతున్నారు. 

భూసేకరణ ప్రక్రియను రద్దు చేయాలని ఆఫీసర్లు, లీడర్లకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని, దీంతోనే దాదాపు వంద మంది పరకాలలో పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బాధిత రైతులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం పరకాల ఆర్డీవో ఆఫీస్ ​నుంచి నామినేషన్​ పత్రాలు తీసుకెళ్లినట్లు తెలిసింది. 

108.34 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం

మంచిర్యాల నుంచి వరంగల్ వరకు 108.34 కిలోమీటర్ల మేర మూడు ప్యాకేజీలుగా ఈ రోడ్డు పనులు చేపట్టనున్నారు. ప్రాజెక్టును  రూ.3,441 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించగా గత జులై లో ఆర్ట్స్​కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఉమ్మడి వరంగల్ లో జయశంకర్​భూపాలపల్లి జిల్లా చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల మీదుగా హనుమకొండ జిల్లా పరకాల, శాయంపేట, దామెర, ఆత్మకూరు, గీసుగొండ, వరంగల్ జిల్లా సంగెం, నెక్కొండ, మహబూబాబాద్ జిల్లా కురవి, సిరోలు, డోర్నకల్​ మీదుగా విజయవాడ వరకు వెళ్తుంది.

మొదటి నుంచీ ఆందోళనలు 

ఇప్పటికే  భూ సేకరణ కోసం పలుమార్లు సర్వేలు జరగ్గా..దీన్ని రైతులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. రోడ్డు నిర్మాణం కోసం దాదాపు 590 హెక్టార్ల భూమి సేకరించనుండగా.. ప్రస్తుతం మార్కెట్​లో రూ.కోట్లలో ధర పలికే భూములకు రూ.8 లక్షల చొప్పున కట్టిస్తామని చెప్పడంతో రైతులు చాలాసార్లు ఆందోళనలకు దిగారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎప్పుడూ స్పందించలేదని, లీడర్లు, ఆఫీసర్ల నుంచి స్పష్టమైన హామీ రాలేదనే ఆగ్రహంతోనే నామినేషన్​ వేసేందుకు సిద్ధమయ్యారు.