బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలోనే పరకాల అభివృద్ధి : చల్లా ధర్మారెడ్డి

ఆత్మకూరు (గీసుగొండ), వెలుగు : కాంగ్రెస్, బీజేపీ నుంచి తెలంగాణను కాపాడుకుందామని పరకాల బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఆగం కావొద్దంటే కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో పరకాల నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.

పొరపాటున కాంగ్రెస్‌‌‌‌కు ఓటు వేస్తే అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పింఛన్‌‌‌‌ను పెంచామని, మూడోసారి అధికారంలోకి వచ్చాక పింఛన్లను రూ. 5,016కు పెంచుతామని హామీ ఇచ్చారు. అధికార దాహంతో కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నాయన్నారు. పని చేసే వారికే పట్టం కట్టాలని తనను మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. పరకాల బరిలో ఉన్న ప్రతిపక్ష లీడర్లకు ప్రజల కష్టాలు తెలియవని, ఎన్నికలు పూర్తి కాగానే వారి అడ్రస్ ఉండదని ఎద్దేవా చేశారు.

అనంతరం వరంగల్‌‌‌‌ జిల్లా సంగెం మండలం కుంటపల్లికి చెందిన పుల్ల ఎల్లయ్య మరో 50 మందితో కలిసి రైతుబంధు మండల కన్వీనర్ కందగట్ల నరహరి ఆధ్వర్యంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరారు. వారికి ధర్మారెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఉపాధ్యక్షులు చిర్ర సునీల్, పుల్ల సతీశ్‌‌‌‌, సంతోష్‌‌‌‌, సుదనపెల్లి ప్రశాంత్, దిలీప్, చిర్ర శ్రీనివాస్, నితిన్‌‌‌‌ కుమార్‌‌‌‌, చిర్ర ప్రసాద్, సురేశ్‌‌‌‌ ఉన్నారు.