- మార్చిలో వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులు
- తక్షణమే పరిహారం చెక్కులు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ
- ఎలక్షన్స్ వస్తుండడంతో ఇప్పుడు చెక్కులను బయటకు తీసిన ఎమ్మెల్యేలు
వరంగల్, వెలుగు : ‘వడగండ్ల వాన వల్ల జరిగిన పంట నష్టం డబ్బులు.. దొంగలు పడ్డాక ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు కాకుండా ఇమ్మిడియేట్‌గా వస్తయి. మునుపటి లెక్క కాదు. మన పైసలు మనమే ఇచ్చుకుందాం, కౌలు రైతులకు కూడా సాయం చేస్తాం’ అని వరంగల్ జిల్లాలో మార్చిలో పంట నష్టం పరిశీలనకు వచ్చిన టైంలో సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ మార్చిలో పంట నష్టం జరిగితే సెప్టెంబర్ వచ్చినా చెక్కులు మాత్రం పూర్తిస్థాయిలో అందడం లేదు. అయితే మార్చిలోనే చెక్కులు రెడీ చేసినా కావాలనే పంచకుండా ఆలస్యం చేశారని తెలుస్తోంది. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో హడావుడిగా చెక్కులు పంచుతూ ప్రచారం చేసుకుంటున్నారు.
మార్చి 18న వడగండ్ల వాన.. 23న కేసీఆర్ రాక
ఈ ఏడాది మార్చి 18, 19 తేదీల్లో అకాల వర్షాలు పడడంతో పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. సీఎం కేసీఆర్ స్వయంగా మార్చి 23న ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రామాపురం, రావినూతల, గార్లపహాడ్, మహబూబాబాద్ జిల్లాలోని పెద్ద వంగర మండలం రెడ్డికుంటతండాతో పాటు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రపురం గ్రామాల్లో పర్యటించారు. ‘వడగండ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులెవరూ అధైర్యపడొద్దు, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటది.
అద్భుతమైన సాయాలుంటయ్. మీకు ధైర్యం చెప్పడానికే ఎండలోపడి వచ్చినా, ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్ట పరిహారం ఇస్తాం. మళ్లా పంటకు రెడీ కావాలే. భయం అవసరంలేదు’ అంటూ హామీలు ఇచ్చారు. ఆఫీసర్ల ప్రాథమిక రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో 2.28 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరుగగా రైతులను ఆదుకునేందుకు రూ.220 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
వారం, పది రోజుల్లో నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు. రైతుల పంట నష్టం పరిశీలన, జాబితా, ఫండ్స్ కేటాయింపు పూర్తైందని, సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యేలు సైతం చెప్పారు.
పంట పరిహారం చెక్కులతో ప్రచారం
మే 12న సీఎం కేసీఆర్ స్థానంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటించి రైతులకు పంట నష్ట పరిహారం చెక్కులను పంపిణీని ప్రారంభించారు. తర్వాత ఎమ్మెల్యేలు ఒకటీ, రెండు చోట్ల చెక్కులు పంపిణీ చేసి ఆ తర్వాత పక్కన పెట్టేశారు. నవంబర్, డిసెంబర్‌లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నట్లు ప్రచారం కావడంతో వెంటనే పంట నష్టపరిహారం చెక్కులను బయటకు తీశారు.
ప్రతి గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏరపాటు చేస్తూ ఎమ్మెల్యేలే ప్రతి రైతుకు చెక్కులు అందజేశారు. ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రకటన పూర్తి కావడంతో ఓ వైపు చెక్కులు ఇస్తూనే.. మరో వైపు తమకే ఓటు వేయాలంటూ ప్రచారం చేసుకుంటున్నారు.