- లబ్ధిదారులతో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
- ఏది కావాల్నో మీరే తేల్చుకోవాలని వెల్లడి
పరకాల, వెలుగు: ‘డబుల్ బెడ్రూం ఇండ్లు వచ్చినోళ్లకు దళితబంధు ఇయ్య. దళితబంధు వచ్చినోళ్లకు డబుల్బెడ్రూం ఇండ్లు ఇయ్య, డబుల్బెడ్రూం ఇండ్లు కావల్నా, దళితబంధు కావాల్నా మీరే నిర్ణయించుకోండి’ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం పరకాల మండలంలోని కామారెడ్డిపల్లిలో రూ.20లక్షలతో నూతన మహిళా కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాలకు పెద్ద కమ్యూనిటీ హాలు ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడా పది గుంటలకు తగ్గకుండా జాగా కేటాయించి భవనాలు నిర్మిస్తున్నామన్నారు. తర్వాత సమావేశానికి హాజరైన వారు దళితబంధు గురించి అడగ్గా ధర్మారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డిపల్లిలో దళితబంధు కింద 12 మందిని ఎంపిక చేశామని, ఆ 12మందిలో కూడా నలుగురికే ఇప్పుడు వస్తదన్నారు.
‘‘ప్రతినెల నలుగురికి చొప్పున మార్చి వరకు దళిత బంధు వస్తది. మనకు ఇచ్చింది 1500. అందులో 500 మాత్రమే సాంక్షన్చేసిన్రు. నియోజకవర్గంలో 20వేల కుటుంబాలు ఉన్నయ్. ఒక్క పరకాలలోనే మూడు పెద్ద కాలనీల్లో 8వేల ఓట్లు ఉన్నయ్. అక్కడ 200 ఇచ్చినా సరిపోవట్లే, తప్పకుండా దళితబంధు మార్చిలోపు 12మందికి ఇస్తం. తరువాత ఎక్కువ ఇస్తం. మీరేం పరేషాన్ గావాల్సిన పనిలేదు. ఒక్కొక్కరికి ఇచ్చుకుంట పోతం’’ అని అన్నారు. రేపటెల్లుండి గ్రామానికి అధికారులు వస్తరని అన్నారు. ఒక్కరికే రెండు పథకాలు ఒకేసారి ఇవ్వడం కుదరదని, తన పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలన్నారు.