అర్హులందరికీ దళితబంధు ఇస్తాం

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల, వెలుగు : దళిత బంధు పథకం అర్హులందరికీ విడతల వారీగా అందిస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండలోని తన నివాసంలో ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారులు, నియోజకవర్గంలోని ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించారు. దళితుల ఆర్థిక బలోపేతం కోసం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఏ యూనిట్ ద్వారా వారి కుటుంబానికి మేలు కలుగుతుందో కుటుంబసభ్యులంతా ఆలోచించి ఆ యూనిట్​ను ఎంచుకోవాలన్నారు. 

రేపటి నుంచి పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర, గీసుగొండ, సంగెం మండలాల వారు మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీసులో, ​పరకాల మున్సిపల్ లో, జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 15 ,16 ,17 డివిజన్ల పరిధిలోని వారు జీడబ్ల్యూఎంసీ ఆఫీస్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి మాధవీలత, సురేశ్​, ఎంపిడిఓలు రాజేంద్రప్రసాద్, అనిత, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్, వీరేశం, వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.