
పరకాల, వెలుగు: అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హనుమకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. గురువారం అకాల వర్షంతో నడికూడ మండలం కంఠాత్మకూరు, పరకాల మండలం లక్ష్మీపూర్ గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను, పరకాల వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం నర్సక్కపల్లిలో ఉడుత లక్ష్మి ఇంటిపైకప్పు ఎగిరిపోయిందనే సమాచారం మేరకు వారిని పరామర్శించి ఓదార్చారు.
ఈ సందర్భంగా ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతుల వివరాలను వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అన్నివిధాలా ప్రభుత్వం ఆదుకునేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో పట్టణ, మండల అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్, కట్కూరి దేవేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డితోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.