ఏదైనా ఒక నిర్దిష్టమైన సమాచారం కోసం గ్రంథాలయాలను సంప్రదించడం మనం ఇప్పటికీ చేస్తున్న పనే. ఇంటర్నెట్ వేదికగా పనిచేసే వికీపీడియా వృద్ధి చెందిన తరువాత ఇటువంటి ఎన్నో ఇబ్బందులకు తెరపడింది. సమాచారం రంగంలో వికీపీడియా విప్లవాన్ని సృష్టించింది. కావాల్సిన సమాచారాన్ని ఒక్క క్షణంలో మన కళ్ళముందుంచే అద్భుత వ్యవస్థ వికీపీడియా. మనకు ఏదైనా సమాచారం కావాలంటే గూగుల్‌లో వెతకగానే మొదటగా సమాచారం లభించేది ఈ వికీపీడియాలోనే. వికీపీడియా 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వికీపీడియా ప్రత్యేకత గురించి తెల్సుకోవడం నేటికాలానికి ఎంతో అవసరం.
వికీపీడియాలో ఎవరైనా రాయవచ్చు, ఏ విషయం గురించైనా రాయవచ్చు (నిబంధనలకు, కట్టుబాట్లకు లోబడి). రాసిన విషయాలను సవరించనూవచ్చు. అలాగే వ్యాసాలను ఎవరైనా ఉచితంగా చదువుకోవచ్చు, ఆ వ్యాసాలను ప్రింటు తీసుకోవచ్చు. కాపీ చేసుకొన్న సమాచారాన్ని తమకు అనుకూలమైన పద్ధతిలోకి ఎడిట్ చేసుకొని వాడుకోవచ్చు. ఇందులో సభ్యత్వానికి ఎటువంటి షరతులు నిబంధనలు ఉండవు. రాయాలన్న కుతూహలం, కొంత భాషా పరిజ్ఞానం మాత్రమే అర్హత.
తెలుగులో లక్ష వ్యాసాలు
తెలుగు భాషావినియోగం ఎన్నో రెట్లు పెరగడంలో వికీపీడియో తెచ్చిన వెసులుబాటు తక్కువైంది కాదు. అందుకే దీన్ని సమాచార రంగంలో విప్లవం అన్నాను. వికీమీడియా ఫౌండేషన్ దీన్ని ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తోంది. ఇది 2001లో జిమ్మీ వేల్స్, లారీ సాంగార్లచేప్రారంభించబడింది. వికీపీడియా మొదటగా న్యూపీడియా అనే ఆంగ్లభాషా విజ్ఞాన సర్వస్వం ప్రాజెక్టుకు సహాయ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. న్యూపీడియాలో ఆయా రంగాలలోని నిపుణులు వ్యాసాలు రాస్తారు. వాటిని ఒక పద్ధతి ప్రకారం రివ్యూ చేసిన పిదప విజ్ఞాన సర్వస్వంలోకి చేరుస్తారు.
Also Read : మొదటి రోజే.. సినిమా చూడకపోతే గొంతెండి చనిపోతారా ?
లోకంలో లభించే విజ్ఞానాన్నంతా ప్రజలందరికీ ఉచితంగా అందించాలనే సదాశయంతోనే 2001లో ఆంగ్ల వికీపీడియా ప్రారంభమైంది. ఆంగ్ల వికీపీడియా ప్రారంభమైన రెండు సంవత్సరాలకు తెలుగు వికీపీడియా (తెవికీ) 2003 డిసెంబరు10న ఆవిర్భవించింది. ప్రస్తుతం వికీపీడియా 325 భాషలలో ఉన్నది. లక్ష వ్యాసాలను పూర్తిచేసుకున్న భాషలు 45. వేయి వ్యాసాలు పూర్తిచేసుకున్న భాషలు 82 వరకు ఉన్నాయి. మన తెలుగు భాష లక్ష వ్యాసాల మైలురాయిని సెప్టెంబర్ 27, 2024న చేరుకుంది.
వికీపీడియాలో అన్నిరంగాల సమాచారం
వికీపీడియా తెలుగులో అందిస్తున్న సమాచారం ఏ ఒక్క రంగానికో, ప్రాంతానికో పరిమితమైంది కాదు. చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, కళలు, స్థలాలు, భౌగోళిక స్థితిగతులు, రాజకీయాలు, సినిమాలు, ప్రముఖులు, శాస్త్రవిజ్ఞానం ఇలా ఒక్కటేమిటి సమస్త విషయాలు తెలుగు వికీపీడియాలో దొరుకుతాయి. తెలుగు సాహిత్యానికి సంబంధించి భాష, జానపద కళారూపాలు, కళాకారులు, కావ్యాలు, నాటకాలు, పద్యాలు, తెలుగు కవులు, తెలుగు పుస్తకాలు, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, సినిమా, శతకాలు, పురాణాలు, ఇతిహాసాలు, నవలలు మొదలగు సాహిత్య ప్రక్రియలకు సంబంధించిన విభాగాలున్నాయి.
వీటితో పాటు ఇతర భాషలకు సంబంధించిన సాహిత్యం అందుబాటులో ఉంది. 2003లో ఆరంభించిన తెలుగు వికీపీడియా ఇప్పుడు లక్ష వ్యాసాలకు పైగా చేరగలిగిందంటే తెలుగు సమాచారానికి ఉన్న డిమాండ్‌ను అర్ధంచేసుకో వచ్చు. ఈ క్రమంలో వికీపీడియాతో ప్రతి ఒక్కరూ చేతులు కలిపి తెలుగు విజ్ఞానాభివృద్ధిలో భాగస్వాములు కావాలి.
-
పరాల నాగరాజు,తెలుగు భాషోపాధ్యాయుడు