అవమానాలకు ఆటతోనే జవాబు పారాలింపిక్స్‌‌‌‌ విజేత దీప్తి.. ఎందరికో స్ఫూర్తి..

అవమానాలకు ఆటతోనే జవాబు పారాలింపిక్స్‌‌‌‌ విజేత దీప్తి.. ఎందరికో స్ఫూర్తి..
  • చిన్నప్పటి నుంచే ఫిట్స్‌‌‌‌, మానసిక లోపం
  • దీప్తి ప్రతిభను గుర్తించి గోపీచంద్‌‌‌‌ అకాడమీకి తీసుకొచ్చిన కోచ్‌‌‌‌ రమేశ్‌‌‌‌
  • బిడ్డ ఆరోగ్యం, ఆట కోసం అరఎకరం పొలం అమ్మిన తల్లిదండ్రులు
  • ఏషియన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ మెడల్‌‌‌‌ గెలిచి అమ్మిన పొలాన్నే తిరిగి కొన్న దీప్తి
  • శుక్రవారం ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌లో ఘన స్వాగతం పలికిన క్రీడాకారులు

వరంగల్/పర్వతగిరి, వెలుగు : ఫిట్స్‌‌‌‌, మానసిక ఎదుగుదల లేకపోవడం ఓ వైపు, కోతిలా ఉన్నావ్‌‌‌‌, పిచ్చి పిల్ల, అబ్బాయిలా ఉన్నావ్‌‌‌‌ అంటూ చుట్టుపక్కల వారి, బంధువుల అవహేళన మరోవైపు.. ఇవన్నీ తట్టుకొని పరుగునే తన ఆయుధంగా మార్చుకొని అందరికీ ఒక్కసారే సమాధానం చెప్పింది పారాలింపిక్స్‌‌‌‌ పతక విజేత జివాంజీ దీప్తి. వరంగల్‌‌‌‌ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి తాను పాల్గొన్న మొదటి పారాలింపిక్స్‌‌‌‌లోనే కాంస్య పతకం సాధించి కోట్లాది మంది అభిమానాన్ని చూరగొనడమే కాకుండా తన లాంటి వారెందరికో స్ఫూర్తిగా నిలిచింది.

పుట్టినప్పటి నుంచీ ఇబ్బందులే..

కల్లెడ గ్రామానికి చెందిన జివాంజీ ధనలక్ష్మి, యాదగిరి దంపతులకు 2003 సెప్టెంబర్‌‌‌‌ 27న దీప్తి జన్మించింది. పుట్టినప్పటి నుంచే ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వయసు పెరుగుతున్నా అందుకు తగ్గట్టుగా మానసిక ఎదుగుదల, మాటల్లో, చేతల్లో చురుకుదనం లేకుండా పోయింది. దీంతో చుట్టుపక్కల వారందరూ దీప్తిని పిచ్చి పిల్లలా చూసేవారు. ఇదే టైంలో దీప్తికి ఫిట్స్‌‌‌‌ రావడం మొదలైంది. ఓ సారి ఫిట్స్‌‌‌‌ వచ్చిన టైంలో ఇంటి పైనుంచి కింద పడడంతో తీవ్రంగా గాయపడింది. అలాగే దీప్తికి జ్ఞాపకశక్తి సరిగా ఉండకపోగా, మెదడు చురుకుగా పనిచేయదు. 

పీఈటీ మాటతో...

గ్రామంలోని స్కూల్‌‌‌‌లో పలుమార్లు నిర్వహించిన పరుగు పందెం పోటీల్లో దీప్తి ప్రతిభ చూపేది. దీన్ని గమనించిన పీఈటీ ఇదే విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో దీప్తి తల్లిదండ్రులు ఆమెను ఆ రంగంవైపు ప్రోత్సహించారు. ఇందుకోసం తమ కుటుంబానికి ఆధారమైన అర ఎకరం పొలాన్ని సైతం అమ్మేశారు. ఎర్రబెల్లి రామ్మోహన్‌‌‌‌రావు ప్రోత్సాహంతో క్రీడల్లో ట్రైనింగ్‌‌‌‌ ఇచ్చే కల్లెడలోని ఆర్డీఎఫ్‌‌‌‌ స్కూల్‌‌‌‌లో చేరిన దీప్తి అథ్లెట్‌‌‌‌గా ఎదగడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. 

కల్లెడ నుంచి గోపీచంద్‌‌‌‌ అకాడమీకి..

గ్రామం నుంచి జిల్లా స్థాయి పోటీలకు హాజరైన క్రమంలో దీప్తిలో ఉన్న ప్రతిభను ఇంటర్నేషనల్‌‌‌‌ అథ్లెటిక్‌‌‌‌ కోచ్‌‌‌‌, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేశ్‌‌‌‌ గుర్తించారు. మానసిక వైకల్యం కారణంగా కఠినమైన శిక్షణను కూడా దీప్తి ఈజీగా చేస్తుండడాన్ని గమనించాడు. దీంతో తాను ట్రైనింగ్‌‌‌‌ ఇచ్చే పుల్లెల గోపీచంద్‌‌‌‌ అకాడమీకి దీప్తిని పంపించేలా ఆమె తల్లిదండ్రులను ఒప్పించాడు. ఇలా 2016లో దీప్తి గోపీచంద్‌‌‌‌ అకాడమీలో చేరింది. అయితే హైదరాబాద్‌‌‌‌ రావడానికి బస్‌‌‌‌ టికెట్‌‌‌‌ డబ్బులు కూడా లేకపోవడంతో రమేశ్‌‌‌‌ తన సహచరుల ద్వారా సాయంచేసి దీప్తి అకాడమీకి వచ్చేలా కృషి చేశారు.

పారా గేమ్స్‌‌‌‌ వైపు..

దీప్తి ఐక్యూ చాలా తక్కువగా ఉండడంతో కోచ్‌‌‌‌ రమేశ్‌‌‌‌తో పాటు అకాడమీ నిర్వాహకులు మెంటల్లీ ఛాలెంజ్డ్‌‌‌‌ వారికి నిర్వహించే పారాగేమ్స్‌‌‌‌వైపు ఆమెను ప్రోత్సహించారు. ఇందులో భాగంగా  200, 400 మీటర్ల పరుగు పందెంలో ట్రైనింగ్‌‌‌‌ ఇచ్చారు. దీప్తి పోటీలోకి దిగిన తర్వాత గెలుపు, ఓటమితో సంబంధం లేకుండా పరుగు పెట్టడంపైనే ఫోకస్‌‌‌‌ చేస్తుంది. పరుగెత్తే క్రమంలో పోటీదారులు తనకు సమీపంగా వచ్చే వరకు పసిగట్టలేని దీప్తి చివరి క్షణాల్లో తన వేగాన్ని పెంచి అనేక పతకాలను తన ఖాతాలో వేసుకుంది. ఇలా ఇప్పటివరకు ఇంటర్నేషనల్‌‌‌‌ లెవల్‌‌‌‌లో 4 గోల్డ్‌‌‌‌, 3 సిల్వర్‌‌‌‌, ఒక బ్రాంచ్‌‌‌‌, నేషనల్‌‌‌‌ లెవల్‌‌‌‌లో 16 గోల్డ్‌‌‌‌, 11 సిల్వర్‌‌‌‌, రెండు బ్రాంచ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ సాధించింది. 

తాజాగా పారిస్‌‌‌‌ పారాలింపిక్స్‌‌‌‌లో మంగళవారం జరిగిన తుదిపోరులో 55.82 సెకండ్లలో గమ్యాన్ని చేరుకొని కాంస్యం సాధించింది. తన కోసం తల్లిదండ్రులు గతంలో అమ్మిన అర ఎకరం పొలాన్ని ఏషియన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో వచ్చిన డబ్బులతో తిరిగి కొనుగోలు చేసి ఇచ్చింది. సొంతూరిలో చిన్న ఇల్లు తప్పితే మరో నివాసం లేకపోవడంతో ప్రభుత్వం తనకు స్థలం కేటాయించి, ఇల్లు కట్టించాలని దీప్తి కోరుతోంది. దాతల మీద ఆధారపడకుండా మరిన్ని పోటీల్లో పాల్గొనేందుకు సర్కార్‌‌‌‌ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది.

ఈ విజయంతో అన్ని కష్టాలను మర్చిపోయాం 

దీప్తి ఇంటర్నేషనల్‌‌‌‌ లెవల్‌‌‌‌లో సాధించిన విజయాలను చూసి మా కష్టాలను మరిచిపోయాం. చిన్నప్పటి నుంచి దీప్తి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చదువుకునే టైమ్‌‌‌‌లో ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో అనేక పథకాలు సాధించడం గర్వంగా ఉంది.ధనలక్ష్మి, యాదగిరి, దీప్తి తల్లిదండ్రులు

దీప్తికి ఘన స్వాగతం

శంషాబాద్, వెలుగు : పారాలింపిక్స్‌‌‌‌లో కాంస్య పతకం సాధించిన జివాంజీ దీప్తి ఢిల్లీ నుంచి శుక్రవారం ఉదయం శంషాబాద్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్టుకు చేరుకుంది. కుటుంబసభ్యులు, కోచ్‌‌‌‌ రమేశ్‌‌‌‌తో పాటు తోటి క్రీడాకారులు, స్నేహితులు భారీ సంఖ్యలో తరలివచ్చి దీప్తికి ఘన స్వాగతం పలికి, సన్మానించారు. ఈ సందర్భంగా దీప్తి మాట్లాడుతూ పారాలింపిక్స్‌‌‌‌లో పతకం సాధించడం ఆనందంగా ఉందన్నారు. వచ్చే ఒలింపిక్స్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. తన తల్లిదండ్రులతో పాటు కోచ్‌‌‌‌ రమేశ్‌‌‌‌, పుల్లెల గోపీచంద్‌‌‌‌కు కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం ఎయిర్‌‌‌‌పోర్టు నుంచి నేరుగా గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌‌‌‌ అకాడమీకి వెళ్లారు.

దీప్తి సాధించిన విజయాలు

  • 2023లో చైనాలో నిర్వహించిన ఫోర్త్‌‌‌‌ ఏషియన్‌‌‌‌ పారా గేమ్స్‌‌‌‌ 400 మీటర్ల టీ 20 విభాగంలో 56.69 సెకన్లలో గమ్యాన్ని చేరి గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ సాధించింది.
  • 2023లో ఫ్రాన్స్‌‌‌‌లో నిర్వహించిన ఏషియన్‌‌‌‌ గేమ్స్ 400 మీటర్లు, 200 మీటర్ల విభాగంలో సిల్వర్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ సాధించింది.
  • 2022 నవంబర్‌‌‌‌లో ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఏషియన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ 400 మీటర్లు, 200 మీటర్ల విభాగంలో గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ దక్కించుకుంది.
  • 2022 సెప్టెంబర్‌‌‌‌లో  మొరోకోలో నిర్వహించిన వరల్డ్‌‌‌‌ పారా అథ్లెటిక్స్‌‌‌‌ గ్రాండ్‌‌‌‌ ప్రిక్స్‌‌‌‌ 400 మీటర్ల విభాగంలో గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ సాధించింది.
  • 2019 మార్చిలో హంకాంగ్‌‌‌‌లో నిర్వహించిన మూడో యూత్‌‌‌‌ ఏషియన్‌‌‌‌ అథ్లెటిక్స్‌‌‌‌ 200 మీటర్ల విభాగంలో బ్రాంజ్‌‌‌‌, మెడ్‌‌‌‌ లీ రిలే పాల్గొని సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌ పొందింది.