తల్లిదండ్రులు ఓకే అంటేనే .. పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్!

తల్లిదండ్రులు ఓకే అంటేనే .. పిల్లలకు సోషల్ మీడియా  అకౌంట్!
  • డేటా ప్రొటెక్షన్ రూల్స్ ముసాయిదా విడుదల చేసిన కేంద్రం
  • రూల్స్ ఉల్లంఘించే కంపెనీలకు రూ.250 కోట్ల దాకా ఫైన్  
  • డ్రాఫ్ట్ రూల్స్​పై ఫిబ్రవరి 18లోపు ఫీడ్​బ్యాక్ ఇవ్వాలని సూచన

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో పిల్లల పేరిట అకౌంట్లు ఓపెన్ చేయాలంటే.. సంబంధిత పిల్లల కుటుంబంలోని పెద్దల నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ముసాయిదా రూల్స్ సిద్ధం చేసింది. పెద్దల అనుమతి తీసుకుని, పిల్లల పేరిట అకౌంట్లు ఓపెన్ చేసిన తర్వాత వారికి సంబంధించిన వ్యక్తిగత డేటాను మొత్తం డిలీట్ చేయాలని నిబంధనలు పొందుపర్చింది. ఇందుకోసం ఆయా సోషల్ మీడియా, ఈ–-కామర్స్ లేదా గేమింగ్ సంస్థలు డేటా ఫ్యుడీషియరీస్ (డేటా నిర్వహణకు ట్రస్టులాంటి వ్యవస్థ)ను ఏర్పాటు చేసుకోవాలని డ్రాఫ్ట్ రూల్స్ లో పేర్కొనారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించే సంస్థలపై రూ. 250 కోట్ల దాకా పెనాల్టీ సైతం విధించేలా నిబంధనలు చేర్చారు. 

Also Read :- గుండె దడకు ఆర్ఎఫ్​సీఏతో చెక్

సోషల్ మీడియాలో వ్యక్తిగత డేటా రక్షణ కోసం రూపొందించిన ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) రూల్స్, 2025’ ముసాయిదాను ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ రూల్స్ పై ప్రజలు ఫిబ్రవరి18లోపు తమ సూచనలు, సలహాలను ఇవ్వాలని కోరింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023లో ఈ నిబంధనలను పొందుపర్చనున్నట్టు ఐటీ శాఖ తెలిపింది. ఈ చట్టాన్ని పార్లమెంట్ ఏడాది కిందటే ఆమోదించినప్పటికీ, తగిన రూల్స్ ను రూపొందించడంలో ఆలస్యమైంది. తాజాగా ముసాయిదా రూల్స్ ను సిద్ధం చేసిన కేంద్రం ప్రజల ఫీడ్ బ్యాక్ కోసం డ్రాఫ్ట్ ను విడుదల చేసినట్టు వెల్లడించింది. ఈ డ్రాఫ్ట్ పై ప్రజలు తమ ఫీడ్ బ్యాక్ ను కేంద్ర ఐటీ శాఖ లేదా మైగవర్నమెంట్ పోర్టల్ 
ద్వారా సబ్మిట్ చేయొచ్చని సూచించింది.