స్కూల్ ఫీజులను నియంత్రించండి .. విద్యా కమిషన్ మీటింగ్​లో పేరెంట్స్ మొర

స్కూల్ ఫీజులను నియంత్రించండి .. విద్యా కమిషన్ మీటింగ్​లో పేరెంట్స్ మొర

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలని పేరెంట్స్ విజ్ఞప్తి చేశారు. ప్రొఫెషనల్ కాలేజీల్లో మాదిరిగా మూడేండ్లకు లాక్ పీరియడ్ పెట్టాలని కోరారు. శుక్రవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్​లో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలోని  కమిషన్ టీమ్​పేరెంట్స్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ స్కూళ్లలో ఫీజుల పరిస్థితి, ఫెసిలిటీస్ గురించి పేరెంట్స్ ను అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు ప్రభుత్వం ఏం చేస్తే పేరెంట్స్ కు లాభం జరుగుతుందనే వివరాలను సేకరించారు. జిల్లా స్థాయిలో ఫీజు రెగ్యులేటరీ కమిటీలు ఏర్పాటు చేయాలని పేరెంట్స్ కోరారు. 

స్కూళ్లలో ఏటా పది నుంచి 15శాతం వరకూ ఫీజులు పెంచుతున్నారని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. స్కూల్ మారాలంటే డిసెంబర్ లోనే టీసీలు తీసుకుపోవాలని మేనేజ్మెంట్లు చెప్తున్నాయని, ఆ తర్వాత తీసుకుంటే ముందస్తు ఏడాది ఫీజు చెల్లించాలని చెప్తున్నారని కమిషన్ ముందు పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. బడుల్లో యూనిఫామ్స్, బుక్స్ అమ్మొద్దని ఆదేశాలు ఉన్నా.. మేనేజ్మెంట్లు మాత్రం మార్కెట్ రేట్ కంటే 50శాతానికి పైగా రేట్లు పెంచి పేరెంట్స్ కు బలవంతంగా అంటగడుతున్నారని వివరించారు. 

పేరెంట్స్ నుంచి సమాచారం సేకరించిన కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి.. త్వరలోనే ఫీజుల చట్టాన్ని రూపొందేందుకు గానూ సర్కారుకు నివేదిక అందిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యుడు పీఎల్ విశ్వేశ్వర్ రావు, హెచ్ఎస్ పీఏ ప్రతినిధి వెంకట్ సాయినాథ్ తదితరులు
 పాల్గొన్నారు.