
వాళ్లది రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. రోజూ కూలీకి వెళ్లి కుటుంబాన్ని నడపాల్సిన పరిస్థితి. అయితేనేం.. చదువే తమ భవిష్యత్తును మారుస్తుందని నమ్మారు తల్లిదండ్రులు. తమలాగా తమ బిడ్డ కష్టాలు పడవద్దని ఉన్నంతలో చదివించారు. చిన్నప్పటి నుంచే ప్రభుత్వ బడులలో చదువు చెప్పించారు. చదువుపై ఎక్కువగా అవగాహన లేని తల్లిదండ్రులు ఆ మట్టిలో మాణిక్యానికి ఒక దారి చూపారు. అంతే అతడు ఎక్కడా ఆగకుండా గమ్యాన్ని చేరుకున్నాడు. మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలైన సివిల్స్ ఫలితాల్లో తొలి ప్రయత్నంలోనే 949వ ర్యాంకు సాధించి ఆ పేరెంట్స్ కన్న కలలను నిజం చేశాడు.
కుమ్రంభీం జిల్లాకు చెందిన రాంటేక్ సుధాకర్ సివిల్స్ లో ర్యాంకు సాధించాడు. కౌటలా మండలం బోదంపల్లి నివాసి అయిన కూలి సోమయ్య కొడుకు సుధాకర్. తమ కొడుకు అత్యున్నత సర్వీస్ లో ర్యాంకు సంపాదించడంపై ఆనంద వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు, గ్రామ వాసులకు స్వీట్లు పంచుతూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. సుధాకర్ ర్యాంకు సాధించడంపై గ్రామస్థులు, బంధువులు ఆ తల్లిదండ్రులను అభినందించారు.
సుధాకర్ చిన్ననాటి నుంచీ చదువుపై శ్రద్ధాసక్తులతో ఉండేవాడని తల్లిదండ్రులు తెలిపారు. చదువు తప్ప ఏదీ మన జీవితాన్ని మార్చలేదు అని చెప్పిన మాటలను ఒంటబట్టించుకున్నాడని, పరిస్థితులు ఎలా ఉన్నా చదువుపై ధ్యాసను మాత్రం వీడలేదని చెప్పారు. ఐఐటీ ఖరగ్ పూర్ లో ఎమ్మెస్సీ కెమెస్ట్రీ చదివిన సుధాకర్.. సివిల్స్ ర్యాంకు సాధించడంతో జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి.