తుట్టెలు కట్టిన పప్పుతో కూర

  • అరకిలో పెరుగుతో 180 మంది స్టూడెంట్లకు భోజనం
  • మోత్కూరు గురుకులంలో ముందు అఖిలపక్షం, పేరెంట్స్​ ఆందోళన

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా మోత్కూరు బాలుర గురుకులంలో  ఫుడ్​ పాయిజన్​ ఘటనపై ఆదివారం అఖిలపక్షం లీడర్లతో పాటు పేరెంట్స్​ ఆందోళన నిర్వహించారు.  ఈ సందర్భంగా వారు గురుకులంలోకి వెళ్లి స్టూడెంట్స్​ కోసం వండిన వంటలు,  వాడుతున్న సరుకులను పరిశీలించారు.  స్టూడెంట్స్ తో చపాతీలు చేయిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  8వ తరగతి  నుంచి ఇంటర్​  వరకు 180 మంది  స్టూడెంట్స్​ఉంటే..  వారి కోసం కేవలం 2.50 కిలోల పప్పు అది కూడా తుట్టెలు కట్టిన దానితో వండడంపై మండిపడ్డారు. అరకిలో పెరుగునే అందరికీ వడ్డిస్తున్నారని, నాన్​వెజ్​ అస్సలే పెట్టడం లేదని  ప్రిన్సిపల్​ వెంకటస్వామిని నిలదీశారు. స్టూడెంట్స్​ అస్వస్థతకు గురైతే తమకు ఎందుకు సమచారం ఇవ్వలేదని ప్రశ్నించారు.  అనంతరం గురుకులం ఎదుట అఖిలపక్షం లీడర్లు, పేరెంట్స్​ ఆందోళనకు దిగడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

గురుకులాల రీజినల్​ కో ఆర్డినేటర్​ రజిని కూడా వచ్చి ఆందోళన చేస్తున్న వారితో  చర్చించారు.  నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్న టెంటర్​దారుడిపై చర్యలు తీసుకోవాలని ఈసందర్భంగా అఖిలపక్షం లీడర్లు, పేరెంట్స్​ డిమాండ్​  చేశారు. స్టూడెంట్లకు ఆదివారం నాన్​ వెజ్​ ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించగా ‘విరేచనాలు అయినందున వండలేదు’ అని ఆర్సీవో సమాధానం చెప్పడంతో  తుట్టెల కట్టిన పప్పుతో కూరలు ఎలా పెడ్తున్నారని నిలదీయగా.. ఆర్సీవో మౌనంగా ఉండిపోయారు. ఆందోళనలో అవిశెట్టి అవిలిమల్లు, బయ్యని రాజు, పర్రెపాటి యుగంధర్, గడ్డం నర్సింహ, సజ్జనం మనోహర్, గూడెపు నాగరాజు, అన్నెపు వెంకట్, మందుల సురేశ్​, బందెల రవి, పుల్కరం మల్లేశ్, ​ఉప్పల శాంతి కుమార్ పాల్గొన్నారు. స్టూడెంట్స్​కు అస్వస్థత, నాసిరకం సరుకులు, వంటపై ఉన్నతాధికారులకు   రిపోర్ట్​ పంపించామని ఆర్సీవో తెలిపారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.