
- కొత్త చట్టం వస్తదేమోనని కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ల నిర్వాకం
- వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పుడే ఫీజుల పెంపు
- 15 నుంచి 50 శాతం వరకు పెంచుతూ ప్రకటనలు
- 25 శాతం ముందే కట్టాలని పేరెంట్స్ పై ఒత్తిడి
- ఆందోళన బాటలో స్టూడెంట్లు, పేరెంట్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ఉన్నఫలంగా ఫీజులు పెంచేస్తున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తికాక ముందే వచ్చే ఏడాది ఫీజులను నిర్ణయిస్తున్నాయి. దాదాపు మెజార్టీ స్కూళ్లు ఇప్పటికే తమ ఫీజులను 15 నుంచి 50 శాతం దాకా పెంచేశాయి. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చట్టం తీసుకొస్తుందనే ప్రచారంతో మేనేజ్మెంట్లు ఒక్కసారిగా అలర్ట్‌అయ్యాయి. చట్టం తెచ్చాక ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచే అవకాశం లేనందున ముందే ఫీజులు పెంచుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫీజుల నియంత్రణపై రాష్ట్ర సర్కారు ఫోకస్
కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఆకునూరి మురళి నేతృత్వంలో ఏర్పాటుచేసిన తెలంగాణ విద్యా కమిషన్ ఇప్పటికే పేరెంట్స్, మేనేజ్మెంట్స్, విద్యావేత్తలతో సమావేశాలు నిర్వహించింది.
వారి సూచనలు, సలహాలతో తాము పరిశీలించిన అంశాల ఆధారంగా, ఫీజుల నియంత్రణపై ప్రత్యేకంగా నివేదిక తయారు చేసి సర్కారుకు అందజేసింది. ఈ మేరకు ఫీజుల నియంత్రణ చట్టం డ్రాఫ్ట్ ను సైతం రూపొందించింది. ప్రస్తుతం ఇందులోని అంశాలపై విద్యాశాఖ అధికారులు సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే ఫీజుల నియంత్రణ చట్టం చేసే అవకాశం ఉందని, దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న ఫీజులపైనే భవిష్యత్తు ఫీజులను నిర్ణయిస్తారనే ప్రచారం మొదలైంది. ఈ వార్తలతో అలర్ట్అయిన కార్పొరేట్ మేనేజ్మెంట్లు ఉన్నఫలంగా ఫీజుల పెంపునకు శ్రీకారం చుట్టాయి. ఏటా 5 నుంచి10 శాతం పెంచే యాజమాన్యాలు ఈ సారి ఏకంగా 50 శాతం దాకా పెంచేస్తున్నాయి.
టీసీలు ఇవ్వకుండా తిరకాసు
రాష్ట్రంలో 11వేలకు పైగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ఉండగా, వాటిలో 33 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. స్టేట్ సిలబస్ బడులకు జూన్ లో.. సీబీఎస్ఈ బోర్డుకు ఏప్రిల్‌లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది. కానీ ఫీజుల నియంత్రణకు రాష్ట్ర సర్కారు చట్టం చేస్తుందనే సమాచారంతో కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఈసారి కొత్త ఎత్తుగడ అమలుచేశాయి. ఎవరికైనా టీసీలు కావాలంటే ముందే చెప్పాలని జనవరిలోనే పేరెంట్స్‌కు ఆదేశాలిచ్చాయి. వారికి కనీసం ఆలోచించుకునే సమయం ఇవ్వకుండా ఫిబ్రవరిలో టీసీల జారీ ప్రక్రియ క్లోజ్‌చేసి, ఫీజుల పెంపు నిర్ణయాన్ని ప్రకటించేశాయి. పెరిగిన ఫీజులను చూసి ఆగ్రహిస్తున్న పేరెంట్స్.. టీసీలు అడిగితే ఇవ్వడం లేదు. తాము ఈ విషయాన్ని ముందే చెప్పామని, ఇప్పుడు కచ్చితంగా టీసీ కావాలంటే వచ్చే విద్యా సంవత్సరం మొత్తం ఫీజు చెల్లించాలని కండిషన్ పెడ్తున్నాయి. దీంతో ఆయా స్కూళ్ల ఎదుట పేరెంట్స్ ఆందోళనకు దిగుతున్నారు.
అత్యధిక ఫీజులు తెలంగాణలోనే..
రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ప్రీ ప్రైమరీ నుంచే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. దేశంలోనే అత్యధికంగా స్కూల్ ఫీజులు తెలంగాణలోనే ఉన్నాయని ఇటీవల తెలంగాణ విద్యా కమిషన్ నిర్వహించిన సర్వేలో తెలిసింది. హైదరాబాద్ నగరంలోని ఓ స్కూల్లో ఎల్‌కేజీకే ఏకంగా రూ.12 లక్షల ఫీజు వసూలుచేస్తున్నట్టు గుర్తించింది. ఈ దోపిడీకి చెక్ పెట్టాలంటే ఫీజుల నియంత్రణ తప్పనిసరి అని సర్కారుకు కమిషన్ తెలిపింది. ఈ క్రమంలోనే ప్రైవేట్ స్కూళ్లను ఐదు కేటగిరీలుగా విభజించి, ఏటా 10 శాతం మాత్రమే ఫీజులు పెంచుకునే అవకాశం ఇవ్వాలని సిఫార్సు చేసినట్టు తెలిసింది. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులను నియంత్రిస్తామంటూ గత బీఆర్ఎస్ సర్కారు ప్రచారం చేసినా.. అమలు చేయలేదు. 2014లో అధికారంలోకి వచ్చిన రెండేండ్లకు ప్రజల ఆందోళనలతో చేసేదేమీ లేక ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో ఓ కమిటీని వేసింది. ఆ కమిటీ.. మేనేజ్మెంట్లు, టీచర్లు, విద్యావేత్తలు, పేరెంట్స్‌తో చర్చలు జరిపి, చివరికి సర్కారుకు నివేదిక ఇచ్చింది. దీంట్లో పలు అంశాలు వివాదాస్పదంగా ఉన్నట్టు బయటకురావడంతో, సర్కారు దానిని పక్కన పెట్టేసింది.
హయత్ నగర్ జీ స్కూల్ వద్ద పేరెంట్స్ ఆందోళన
ఎల్ బీనగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లోని జీ హైస్కూల్ ఉన్నపళంగా 40 శాతం ఫీజులు పెంచడంతో పేరెంట్స్ శనివారం ధర్నాకు దిగారు. స్కూల్ మేనెజ్మెంట్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేరెంట్స్ మాట్లాడుతూ.. ఏడాదికి 5 నుంచి 10 శాతం ఫీజులు పెంచుతామని చెప్పి.. ఇప్పుడు ఏకంగా 40 శాతం పెంచడం ఏమిటని నిలదీశారు. అడ్డగోలుగా ఫీజులు పెంచుతున్న జీ హైస్కూల్ యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిటీ శివారు భూదాన్ పోచంపల్లి మండల పరిధిలో ఉన్న స్కూల్ ను సిటీకి తెచ్చి అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
ఫీజుల చట్టం చేయాలె
చట్టం తీసుకొచ్చి ఫీజులను నియంత్రిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ చేయకుండా పేరెంట్స్ ను మోసం చేసింది. కనీసం ప్రస్తుత ప్రభుత్వమైనా కార్పొరేట్, ప్రైవేట్ బడుల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.
ఇప్పటికే తెలంగాణ విద్యా కమిషన్‌కు పేరెంట్స్ తరఫున మా డిమాండ్స్ చెప్పాం. ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలి.
- వెంకట సాయినాథ్, హెచ్ఎస్పీఏ నేత