కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని.. బతికుండగానే శ్రద్ధాంజలి

గద్వాల, వెలుగు: జోగులాంబ  గద్వాల జిల్లాలో  కూతురు ప్రేమ పెళ్లి చేసుకున్నదని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు బతికుండగానే ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టారు. గట్టు మండలానికి చెందిన ఓ యువతి జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జాబ్​ రిత్యా ఉంటోంది. ధరూర్ మండలం బురెడ్డిపల్లికి  చెందిన ఓ యువకుడు ప్రేమించుకున్నారు. కొన్ని రోజుల కింద వారిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన ఆమె తల్లిదండ్రులు ఆ యువకుడిని వదిలేసి రావాలని కూతురిపై ఒత్తిడి తెచ్చారు. ఆమె వినకపోవడంతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. సఖి సెంటర్ కు తరలించి నచ్చజెప్పి ప్రయత్నం చేసినా వినలేదు. 

పేరెంట్స్ నుంచి తమకు ప్రాణహాని ఉందని పోలీస్​ స్టేషన్​లో కంప్లైంట్ చేసింది.  వారిద్దరూ మేజర్లు కావడంతో వారి ఇష్టం మేరకు రెండ్రోజుల కింద  ఇతర ప్రాంతాలకు తరలించారు. దీంతో పోలీసులు తమకు సపోర్ట్ చేయడం లేదని భావించిన యువతి బంధువులు ఎస్సైపై పలు ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా తమ అమ్మాయి చనిపోయిందని సోషల్ మీడియాలో పుకార్లు వైరల్ చేశారు. వీటితోపాటు ఆదివారం దశదినకర్మ ఉందని శ్రద్ధాంజలి ఘటించారు. ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.