కరీంనగర్​ జిల్లా చిగురుమామిడిలో రాస్తారోకో

కరీంనగర్​ జిల్లా చిగురుమామిడిలో రాస్తారోకో

చిగురుమామిడి, వెలుగు: విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉందంటూ కరీంనగర్​ జిల్లా చిగురుమామిడి మండలంలోని చిన్న ముల్కనూర్ లోని టీఎస్​ మోడల్​స్కూల్​లో శుక్రవారం తల్లిదండ్రులు ఆందోళన చేశారు. శుక్రవారం పేరెంట్స్​మీటింగ్​కు వచ్చిన వారు భోజనం విషయమై ప్రిన్సిపాల్​శ్రీనివాసా చారితో పాటు మధ్యాహ్న భోజన నిర్వాహకులపై మండిపడ్డారు. స్కూల్​ కు ఎదురుగా ఉన్న హుస్నాబాద్–కరీంనగర్​ మెయిన్​రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. వారు మాట్లాడుతూ ముక్కిపోయిన బియ్యం వండుతున్నారని, కనీసం చెరగడం లేదని, భోజనంలో పురుగులు వస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. తినడం ఇష్టం లేక ఇంటి నుంచి బాక్స్​లు తీసుకువెళ్తే పారేయిస్తున్నారన్నారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ కొత్త వినీత,తహసీల్దార్​ సయ్యద్​మోహిన్​ హైమద్​, ఎంపీటీసీ జమున అక్కడికి వచ్చి వారితో మాట్లాడారు. సమస్య పరిష్కారమయ్యేట్టు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

అంగన్​వాడీ పప్పన్నంలో బొద్దింక

హసన్​పర్తి:  హనుమకొండ జిల్లా హసన్​పర్తి మండలం హరిచంద్ర నాయక్ తండా లోని అంగన్​వాడీ కేంద్రంలో శుక్రవారం పిల్లలకు వడ్డించిన మధ్యాహ్న భోజన పప్పన్నం లో బొద్దింక కనిపించింది. దీంతో పిల్లలు భయపడ్డారు. దీని గురించి తల్లిదండ్రులు సర్పంచ్ కు ఫిర్యాదు చేశారు. అంగన్​వాడీ టీచర్​అందుబాటులో లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.