ఛీ నీచుడా..! నాలుగేళ్ల బాలికలపై లైంగిక వేధింపులు.. రోడ్డెక్కిన వందలాది తల్లిదండ్రులు

ఛీ నీచుడా..! నాలుగేళ్ల బాలికలపై లైంగిక వేధింపులు.. రోడ్డెక్కిన వందలాది తల్లిదండ్రులు

జరుగుతున్న అకృత్యాలు, వెలుగుచూస్తున్న సంఘటనలు చూస్తుంటే.. ఆడపిల్లల భవిష్యత్తు గురించి ఏంటో.. ఎలానో అని సందేహించాల్సిందే. ఇంట్లో ఉంటే కుటుంబసభ్యులు కాటేస్తున్నారు.. బయటకెళ్తే బిడ్డ తిరిగొస్తుందో.. లేదో అన్న భయం. పోనీ, దేవాలయం లాంటి బడికి పంపితే సురక్షితంగా ఉంటారా..! అంటే అక్కడా మానవ రూపంలో మృగాలు ఉంటున్నాయి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు, సహాయం అందించాల్సిన పాఠశాల సిబ్బంది ఎవరో ఒకరు తమ వక్రబుద్ధిని బయట పెడుతున్నారు. ప్రతి క్షణం.. ప్రతి చోట దేశంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 

తాజాగా, మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో కిండర్ గార్డెన్ విద్యనభ్యసిస్తున్న నాలుగేళ్ల పసిపిల్లలపై అటెండర్ లైంగిక వేధింపులకు దిగాడు. పాఠశాలలోని టాయిలెట్‌లో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి బాధిత పిల్లలకు తెలుసు కనుక ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటికెళ్లిన పిల్లలు తల్లితో అటెండర్ తమను అనుచితంగా తాకాడని చెప్పడంతో అతని నీచపు బుద్ధి బయటపడింది. ఈ ఘటనలో పాఠశాల అటెండర్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

రోడ్డెక్కిన తల్లిదండ్రులు

ఈ ఘటన పట్ల కోపోద్రిక్తులైన వందలాది తల్లిదండ్రులు మహారాష్ట్రలో రోడ్డెక్కారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు మంగళవారం ఉదయం బద్లాపూర్ రైల్వే స్టేషన్‌ను దిగ్బంధించారు. ఆ సమయంలో పోలీసులు వారిని వెళ్లగొట్టే ప్రయత్నం చేయగా పరిస్థితి చేయి దాటింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వగా, పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

స్కూల్ యాజమాన్యం చర్యలు

ఈ ఘటన వెలుగులోకి వచ్చాక పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపాల్, క్లాస్ టీచర్, మహిళా అటెండర్‌ను బాధ్యులుగా చేసి సస్పెండ్ చేసినట్లు తెలిపింది. పాఠశాల ఆవరణలో నిఘా పెంచుతామని వెల్లడించింది.

కాగా, ఈ ఘటనలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డీసీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇచ్చారు.