మన పిల్లలు ఏం కావాలి?

మన పిల్లలు ఏం కావాలి?

నిజంగా  పిల్లలకేం కావాలి.. పిల్లలేం కావాలి. వారు మన నుంచి ఏం ఆశిస్తున్నారు? సంరక్షకులుగా మనం వారికి ఏమి ఇవ్వాలి. ఎలాంటి వాతావరణం వారికి మనం కల్పించాలి. ఏ విధమైన శిక్షణా పరమైన మానసిక సంసిద్ధతను మనం తల్లిదండ్రులుగా కల్పించాలనేది ప్రశ్న. ‘మనిషి సంఘజీవి’ అంటాడు ప్రఖ్యాత తత్త్వవేత్త అరిస్టాటిల్, సంఘం నుంచి మనిషిని వేరుచేసి చూడలేం. ఒకవేళ మనిషిని సంఘం నుంచి లేదా సమూహం నుంచి బహిష్కరిస్తే అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది, అతని ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది కూడా మానసిక శాస్త్రవేత్తలు వివిధ ప్రయోగాల ద్వారా నిరూపించారు. అంటే కుటుంబం నుంచి  మనిషిని వేరుగా ఊహించలేం. 

ప్రతి మనిషి జీవితంలో అత్యంత కీలక పాత్ర పోషించే దశ బాల్యదశ. ఈ దశలో పడే సానుకూల దృక్పథాలే పిల్లల మానసిక స్థితిపై ఆధారపడి వుంటుందనేది వాస్తవం. గతమెంతో ఘనకీర్తి అన్నట్లు మన సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవి. ఒకప్పుడు సామూహిక జీవన విధానంవుండేది. ఇప్పుడు వ్యక్తిగత జీవితానికి అలవాటుపడి యాంత్రిక జీవితం వైపు మొగ్గు చూపుతుండటం, ఆధునికత సంతరించుకొని సామూహిక జీవనం నుంచి ఒంటరితనం వైపు ప్రయాణించటం బాధ కల్గించే విషయం. అందుకే నేడు నిత్యం మైనర్లు పబ్బుల్లో, క్లబ్బుల్లో, రేవ్ పార్టీల్లో, డ్రగ్స్ బాధితులుగానో, అత్యాచార కేసుల్లో నిందితులుగానో, హింసాయుత సంఘటనల్లో పాల్గొనటం బాధ కల్గించే విషయం. 

తల్లిదండ్రులే మార్గదర్శనం చేయాలి

ఆమధ్య హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన మైనర్ బాలికపై అత్యాచార సంఘటనలో ఐదుగురు మైనర్లు, బాధిత బాలిక కూడా మైనరే కావటం ఇక్కడ ప్రస్తావనార్హం. పిల్లల శారీరక మానసిక పెరుగుదల, వికాసం తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వారికి సరైన మార్గదర్శనం చేస్తూ ఉండాలి. బాలిక ఐతే తల్లి, బాలుడు ఐతే తండ్రి చొరవ తీసుకొని వారిలో సహజమైన ప్రవర్తన, అసహజమైన ప్రవర్తన.. వాటి వల్ల కలిగే పరిణామాలు, ఫలితాలు వివరించి చెప్పగలగాలి.

అజ్మల్​ కసబ్​ గురించి..

ఈ సందర్భంగా మరొక సంఘటనను గుర్తుచేయాలి 2008 నవంబర్ 11న ముంబైలో జరిగిన మారణహోమం మన అందరికీ తెలిసినదే. ఆ ఉగ్రదాడి వల్ల ఎంతోమంది చనిపోయారు, మరికొంతమంది గాయపడ్డారు ఆస్తి, ప్రాణ నష్టం వెలకట్టలేనిది. ఈ దాడులలో పాల్గొన్న నిందితులలో ఒకడు ‘అజ్మల్​ అమీర్  కసబ్’ తండ్రి ఫరీద్ కోట్ గ్రామంలో నివసించే నిరుపేద. రంజాన్ పండక్కి కొత్తబట్టలు కొనివ్వమని తండ్రిని అడిగితే కొనివ్వలేని పేదరికం, తండ్రి మీద కోపంతో ఇంట్లోంచి పారిపోవటం అతని ఆర్థిక స్థితిని ఆసరాగా చేసుకొని కొంత నగదు ముట్టజెప్పి, చెప్పిన పనిచేస్తే కుటుంబం ఇంకా ఉన్నత స్థితికి వెళ్తుందని మభ్యపెట్టి అతనిని తీవ్రవాదిగా శిక్షణ ఇప్పించటం, తదనంతరం ముంబై మారణ హోమానికి ప్రత్యక్ష కారకుడు కావటం మనందరికీతెలిసిన విషయమే. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏమీ తెలియని పసి మనసులలో ఎలాంటి ముద్రలను మనం బలంగా వేస్తామో వాటినే పెద్దైన తర్వాత పిల్లలు అనుసరించే ప్రమాదం వుంది. ఇక్కడ ప్రఖ్యాత తత్త్వవేత్త అరిస్టాటిల్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించాలి ‘చిన్నపిల్లల మనస్సు ఏమీ రాయని నల్ల బల్ల లాంటిది’. 

పాశ్చాత్య సంస్కృతితో..

మారుతున్న జీవన సరళి, ఆకర్షింపబడుతున్న పాశ్చాత్య సంస్కృతి, కొడిగడుతున్న మానవ విలువలు, పలుచబడుతున్న సంబంధ బాంధవ్యాలు దీనికి తోడు మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల పిల్లల్లో కలిగే మానసిక, శారీరక మార్పులుఫలితంగా వచ్చే మార్పులను అర్ధం చేసుకోలేక సంఘర్షణకు గురవుతున్నారు. తల్లిదండ్రులు పర్యవేక్షించక, సరైన మిత్రులు మార్గదర్శనం చేయక, ఉపాధ్యాయులు వారిలో వచ్చే ప్రవర్తనాపరమైన మార్పులను గమనించకపోవటం ఫలితంగా జరుగుతున్నవే నేరాలు, ఘోరాలు. దారి తప్పుతున్న బాల్యం. వెరసీ దాని ఫలితాలు, పర్యవసానాలు సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి.

రూసో, బెజోస్​ల బాల్యం

ఒకరు ఫ్రెంచ్ తత్త్వవేత్త ‘జీన్ జాక్ రూసో’ మరొకరు ‘జెఫ్ బెజోస్​’ రూసో బాల్యంలోనే తల్లిని కోల్పోవడం, తండ్రి బాగా మద్యం సేవించి చిన్న పిల్లవాడైన రూసో చేత బూతు పుస్తకాలు చదివిస్తూ ఆనందించేవాడు. అలాంటి పరిస్థితుల మధ్య పెరిగి పెద్దవాడై అతను చేసిన రచనలు (సోషల్ కాంటాక్ట్, ది ఎమిలి) ఫ్రెంచ్ విప్లవానికి పరోక్ష కారణాలుగా నిలిచాయని చరిత్ర చెప్పిన సత్యం. ఇక అమెరికన్​ బిజినెస్​మెన్​ జెఫ్  బెజోస్​ ..ఇతని తల్లి (జాక్లిన్) యవ్వనంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ప్రేమించి గర్భం దాల్చడం, అతను మోసం చేయడం, ఆత్మహత్యకు పూనుకొని విరమించుకోవడంతో జెఫ్ బెజోస్​ జన్మించాడు. నేడు అమెరికాలోని సంపన్నులలో బెజోస్​ ఒకడు. ఇక్కడ హిట్లర్ అయినా, కసబ్, రూసో, బెజోస్​ అయినా వారి కుటుంబ నేపథ్యాలు వేరు. కానీ,వారు పెరిగిన విధానాలే మనం గమనించాల్సిన విషయాలు.

యానిమల్, సలార్​ సినిమాల కథా సారాంశాలూ అవే..

ఇటీవల బాలీవుడ్, టాలీవుడ్​లో వచ్చిన “యానిమల్” సినిమాలో బాల్యంలో తండ్రి అశ్రద్ధకు గురైన కథానాయకుడు వికృతంగా ప్రవర్తిస్తూ తన తండ్రిపై ఉన్న ప్రేమతో శత్రువులను (తన బంధువర్గం వారిని) కిరాతకంగా చంపుతాడు. ఇందులో హింస మితిమీరిపోయినట్లుగా ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభ సభ్యురాలు రజత్ రంజన్ ప్రస్తావించడం ఆలోచించదగ్గ విషయం. ఇక బాక్స్ ఆఫీస్ రికార్డులు సృష్టిస్తున్న రెండో సినిమా ‘సలార్’ ఇందులో కూడా హీరో బాల్యంలో జరిగిన హింసాత్మక సంఘటనల వల్ల తల్లి అతడిని (ప్రభాస్)ను దూరంగా తీసుకెళ్లి పెంచుతుంది. అయినా వాటి నుంచి దూరం కాలేక హింస వైపు మళ్లుతాడు. అంటే మనిషి జీవితంలో బాల్యం ఎంత గొప్పదో ఎటువంటి మలుపులు తిప్పుతుందో అర్థం చేసుకోవచ్చు. 

యుద్ధాల వల్ల నష్టపోతున్నది పిల్లలే

 పిల్లల్ని బలమైన జాతి సంపదగా ప్రభుత్వాలు గుర్తించి వారి పట్ల అమానవీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలి.  పాలకులు ఎవరైనా కావచ్చు చిన్న పిల్లలు ప్రభావితం అయ్యే హింసాత్మక విధానాలు, ఘర్షణలు, యుద్ధాలు నివారించే ప్రయత్నం చెయ్యాలి.  యుద్ధం ద్వారా వారు ఎంతటి మానసిక క్షోభను అనుభవిస్తున్నారో ఆలోచించండి.  ఆదిమ సమాజంలో జాతుల మధ్య, మధ్య యుగాలలో మతాల మధ్య, నేడు ఆధిపత్యం కోసం జరుగుతున్న యుద్ధాల ద్వారా పసి పిల్లల్ని చంపడం అనాగరికమైన చర్యగా భావించాలి. 

బాల్యంలో జరిగే సంఘటనలే పిల్లలపై బలమైన ప్రభావం చూపుతాయి. ఒక్క హిట్లర్ దూకుడు చర్య వల్ల ప్రపంచం మొత్తం నష్టపోతే యుద్ధాలలో పుట్టిన, యుద్ధాల ద్వారా నష్టపోయిన పిల్లలు భవిష్యత్తులో హింసాత్మక చర్యలకు పాల్పడి ప్రపంచాన్ని అస్థిర పరిస్తే దానికి బాధ్యులం మనం కాదా. అందుకే  ప్రపంచంలో  శాంతి సుస్థిర సమాజాలను స్థాపించి పిల్లలకు కానుకగా ఇవ్వాలి. అలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలే ప్రయోజకులు అవుతారని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

 ‘హిట్లర్’​ పై బాల్యం ప్రభావం

చరిత్రలో నమోదైన ఒక విషయాన్ని ప్రస్తుతం ప్రస్తావించదలిచాను. అది జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ బాల్యంలో జరిగిన సంఘటన. పాఠశాలలో చదువుతున్న రోజుల్లో ఒక యూదు టీచర్ హిట్లర్​ను దండించటం జరిగింది. ఆ తర్వాత పెరిగి పెద్దవాడైన హిట్లర్ 1933లో జర్మనీ దేశానికి అధ్యక్షుడిగా మారిన తర్వాత ‘గెస్టసో’ అనే రహస్య గూఢచార దళాన్ని ఏర్పాటుచేసి తనకు వ్యతిరేకంగా వున్న ఎంతోమంది యూదులను గ్యాస్ చాంబర్లో బంధించి చిత్రహింసలుపెట్టి చంపించిన సంఘటనలు చరిత్ర చెప్పిన సజీవ సాక్ష్యాలు. 

- డాక్టర్ మహ్మద్ హసన్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు