ఆన్లైన్ బెట్టింగ్తో అప్పులపాలు.. పొలం అమ్మినా అప్పు తీరకపోవడంతో కుటుంబం ఆత్మహత్య

ఆన్లైన్ బెట్టింగ్తో అప్పులపాలు.. పొలం అమ్మినా అప్పు తీరకపోవడంతో కుటుంబం ఆత్మహత్య

నిజామాబాద్: ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా అప్పులపాలై వాటిని తీర్చలేక ఓ కుటుంబం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో వెలుగుచూసింది. వడ్డేపల్లి గ్రామానికి చెందిన రంగననేని సురేష్, హేమలత దంపతుల కుమారుడు హరీష్ ఆన్లైన్ బెట్టింగ్స్కు అలవాటు పడ్డాడు. లక్షల్లో అప్పు చేసి మరీ ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టి గేమ్స్ ఆడాడు. అతనికి ఉన్న ఈ దురలవాటు వల్ల కుటుంబం అప్పుల్లో కూరుకుపోయింది. కొడుకు చేసిన పనికి ఆ కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. 

ఆ బాధను దిగమింగుకుని కొడుకు చేసిన రూ.30 లక్షల అప్పు తీర్చేందుకు ఉన్న పొలాన్ని అమ్మేశారు. అయినప్పటికీ అప్పు తీరకపోవడంతో అప్పుల బాధతో ఆ కుటుంబం శుక్రవారం (అక్టోబర్ 5, 2024) రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఏసీపీ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాలను బోధన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

కరోనా మహమ్మారి ప్రజల ఆరోగ్యాలను ఎంత ప్రభావితం చేసిందో అలాగే ఈ ఆన్​లైన్​ జూదం విద్యార్థులను, ఉద్యోగులను, వ్యాపారస్తులను ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. కరోనా కాలంలో ఆన్​లైన్​లో ఖాళీగా ఉన్న విద్యార్థులు, వ్యాపారాలు ఆగిపోయిన వ్యాపారస్తులు, ఉద్యోగాలు కోల్పోయిన నిరుద్యోగులు అంతర్జాలంలో పార్ట్​ టైం ఉద్యోగాలు, మొబైల్ ఫోనుతో డబ్బులు ఎలా సంపాదించాలి అని గూగుల్ను ఆశ్రయించడం ఎక్కువైంది. అలా వారందరి పూర్తి వివరాలు ఆయా వెబ్ సైట్లకు చేరుతాయి. వారి పేరు, ఫోన్ నంబర్,  ఈ–మెయిల్ ఐడీ  వివరాలను ఒక వెబ్ సైట్ వాళ్ళు ఇంకొక వెబ్​సైట్ వారికి అమ్ముకుంటారు. ఈ సమాచారాన్ని ఆన్ లైన్ గేమ్స్,  బెట్టింగ్ నిర్వహించే వారు, సైబర్ నేరగాళ్లు కొనుక్కుంటారు.

ALSO READ | షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

ఈ సమాచారాన్ని ఆధారం చేసుకుని వారి నంబర్లకు, టెలిగ్రాం, వాట్సాప్​లో శుభాకాంక్షలు తెలుపుతూ.. మీరు ఆన్​లైన్​లో డబ్బు సంపాదించే ప్లాట్ ఫామ్ కు ఎంపిక అయ్యారు అంటూ లింక్ పంపిస్తారు. లింక్ ఓపెన్ చేస్తే వాట్సాప్ లేదా టెలిగ్రాం చాట్ లోకి వెళుతుంది. అక్కడ ఇతర దేశాల వ్యక్తుల పేర్లు, ఇతర దేశాల నంబర్లతో వారి వాట్సాప్ , టెలిగ్రాంలు ఉంటాయి. రిజిస్టర్ ఎలా అవ్వాలి, ఎలా డబ్బులు డిపాజిట్ చెయ్యాలి, ఎలా ఆటలలో ఇన్వెస్ట్ చెయ్యాలి, ఎంత డబ్బు పెడితే ఎంత డబ్బు వస్తుంది, అనే పూర్తి వివరాలు అందిస్తారు. 100 రూపాయల నుండి మొదలుకొని ఎంత డబ్బు అయినా అందులో డిపాజిట్ చేయవచ్చు. ఇందులో కలర్ గేమ్, క్యాసినో, రమ్మి, తీన్ పత్తి ఇలా సుమారుగా 1500కు పైగా వెబ్ సైట్లు, అప్లికేషన్లు ఉన్నాయి.