కన్న కొడుకును తల్లిదండ్రులే చావగొట్టిన సంఘటన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాంనూరులో చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో కొదురుపాక మహేష్ (35)ను అతని తల్లిదండ్రులు కొదురుపాక భూమయ్య, రాజమ్మ చితకబాదారు. వీరికి భూమయ్య , రాజవ్వల కూతురు మంగ,కౌలు దారు కండ్లే శేఖర్ సహకరించారు. కుటుంబ సభ్యుల దాడిలో తీవ్రంగా గాయపడిన మహేష్..హైద్రాబాద్ లోని ఉస్మానియాలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు మహేష్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
తాగుడు బానిసై..
రాంనూరుకు చెందిన కొదురుపాక మహేష్ కొంతకాలంగా తల్లిదండ్రులతోపాటు భార్యతో గొడవపడేవాడు. భర్త, ఇతర కుటుంబ సభ్యుల వేధింపులతో మహేష్ భార్య పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య వెళ్ళిన తర్వాత మహేష్ తాగుడుకు బానిస అయ్యాడు. ఇదే క్రమంలో ఈనెల 20 న రూ. 200 కావాలని మహేష్ తండ్రిని అడిగాడు. అతనికి డబ్బులు ఇవ్వడానికి తండ్రి నిరాకరించాడు. అదే సమయంలో శేఖర్ అనే కౌలు దారు తండ్రి భూమయ్యను డబ్బులు అడగడంతో అతడికి ఐదువేలు ఇచ్చాడు. తనకు ఇవ్వకుండా కౌలుదారుకు డబ్బులు ఇవ్వడంతో తండ్రితో మహేష్ గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తండ్రి కొడుకుల మధ్య వివాదం తీవ్రమైంది. సహనం కోల్పోయిన తల్లిదండ్రులు భూమయ్య ,రాజమ్మ..కూతురు మంగ, కౌలు దారు శేఖర్ సహకారంతో కొడుకును చావుదెబ్బలు కొట్టారు. కుటుంబ సభ్యుల దాడిలో తీవ్రంగా గాయపడిన మహేష్ స్రృహ కోల్పోయాడు. ఆ తర్వాత యాక్సిడెంట్ అయిందని కుటుంబ సభ్యులు ఆంబులెన్స్ కు ఫోన్ చేశారు. అంబులెన్స్లో జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మహేష్ పరిస్థితి విషమించడంతో కరీంనగర్ కు తరలించారు. అక్కడ కూడా డాక్టర్లు చేతులెత్తేయడంతో హైద్రాబాద్ ఉస్మానియా కి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో మూడు రోజులు చికిత్స పొందుతూ మహేష్ మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.