
హైదరాబాద్, వెలుగు: పీజీ స్టూడెంట్ ప్రీతి మృతితో నిమ్స్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోస్ట్‌మార్టమ్ కోసం ప్రీతి మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించడానికి పోలీసులు ప్రయత్నించగా.. కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమెను హత్య చేశారని పేరెంట్స్ ఆరోపించారు. తమ బిడ్డ చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చే దాకా నిమ్స్ నుంచి కదిలేది లేదని అక్కడే కూర్చున్నారు. తనపై ఒత్తిడి చేస్తే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని ప్రీతి తండ్రి నరేందర్ చెప్పారు. 21న రాత్రి ఎంజీఎంలో ఏం జరిగిందో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఎంజీఎం సూపరింటెండెంట్, అనస్థీషియా డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వాళ్లు ఆ పదవుల్లో కొనసాగితే విచారణ నిష్పక్షపాతంగా జరగనివ్వరని ఆరోపించారు. ప్రీతికి ఎంజీఎం, నిమ్స్‌లో ఏం ట్రీట్‌మెంట్ అందించారో తమకు రాతపూర్వకంగా అందించాలన్నారు. ప్రీతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు మద్దతుగా ప్రజా సంఘాలు, బీజేపీ మహిళా మోర్చా నాయకులు నిమ్స్‌లో ఆందోళనకు దిగారు. సిట్టింగ్ జడ్జితో విచారణకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని, బాధిత కుటుంబానికి రూ.5 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది.