
ఒకవైపు బెట్టింగ్ యాప్స్ పై పోలీసులు దూకుడుగా కేసులు నమోదు చేసుకుంటూ విచారణ కొనసాగిస్తుంటే.. మరోవైపు ఈ కేసులో నిందితుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నువ్వుంటే నువ్వు తప్పు చేశావ్ అన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా నా అన్వేషణ అన్వేష్ పై పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవలే అన్వేష్ ఇమ్రాన్ ఖాన్ గురించి సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టిన సంగతి తెలిసిందే. ఇమ్రాన్ ఖాన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంపై ఆ వీడియోలో అన్వేష్ చేసిన వ్యాఖ్యలు వైరలయ్యాయి. ఈ వీడియోపై ఇప్పటికే కౌంటర్ వీడియో రిలీజ్ చేసిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్.. తాజాగా ఒక సెంటిమెంట్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. సీఎం రేవంత్ రెడ్డికి వీడియో ట్యాగ్ చేస్తూ అన్వేష్ పైన కూడా కేసులు పెట్టాలని ఆ వీడియోలో కోరాడు.
అన్వేష్ తన తల్లిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడని.. అందుకోసం అతడిపై చర్యలు తీసుకోవాలని వీడియోలో పేర్కొన్నాడు. తన అమ్మను ఉద్దేశిస్తూ నా అన్వేష్ చేసిన వ్యాఖ్యల్ని వీడియోలో చూపిస్తూ ఇమ్రాన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను తప్పు చేసి ఉంటే తనపై విమర్శలు చేయొచ్చునని, కానీ తన అమ్మపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటనీ వీడియోలో ఎమోషనల్ అయ్యాడు.
చట్టాన్ని గౌరవిస్తామని, కానీ డబ్బుకోసం, వ్యూస్ కోసం తన తల్లిని దారుణంగా తిట్టిన అన్వేష్ పై కేసు నమోదు చేయాలని కోరాడు ఇమ్రాన్. అన్వేష్ పై కూడా చాలా FIR లు ఉన్నాయని, అతడిపై కడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎంను కోరాడు.