ఆర్టీసీ బస్సులో చిల్లరతో పరేషాన్.. టికెట్టు దొరకక 2కి.మీ. నడిచిన ప్రయాణికుడు

జగిత్యాల జిల్లా ఆర్టీసి బస్సులో చిల్లర కోసం ఓ ప్రయాణికుడు నానా అవస్థలు పడ్డాడు. అంబారీ పేట్ గ్రామం నుంచి వెల్గటూర్ వెళ్లేందుకు ప్రయాణికుడు ఆర్టీసి బస్సు ఎక్కి, టికెట్టు తీసుకున్నాడు. తన వద్ద టికెట్టుకు సరిపడా చిల్లర లేకపోవడంతో ఆ ప్రయాణికుడు తన వద్ద ఉన్న రూ.200 నోటును కండక్టర్ కు ఇచ్చి, మొత్తానికి టికెట్టు తీసుకున్నాడు. తన వద్ద కూడా ఇవ్వడానికి చిల్లర లేకపోవడంతో కండక్టర్... ఆ టికెట్టు వెనకాల రూ.180అని రాసి ప్రయాణికుడికి ఇచ్చింది.

స్టాప్ రావడంతో ప్రయాణికుడు.. మిగిలిన చిల్లర కోసం కండక్టర్ వద్దకు వెళ్లాడు. తన జేబులో అంతకుముందు వేసుకున్న టికెట్టు కోసం వెతకడం ప్రారంభించాడు. ఎంత సేపటికీ ఆ టికెట్టు దొరక్కపోవడంతో ప్రయాణికుడు ఆందోళనకు గురయ్యాడు. కండక్టరేమో టికెట్టు ఇస్తేనే చిల్లర ఇస్తానని చెప్పడంతో వారిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రయాణికుడు చేసేదేం లేక.. ఓ వ్యక్తి నుంచి రూ.20అడిగి కండక్టర్ కి ఇచ్చాడు. మొదట తాను ఇచ్చిన రూ.200 ఇవ్వమని అడగగా.. ఆ టికెట్ చూపెడితేనే ఇస్తానని కండక్టర్ తేల్చేసి చెప్పడంతే.. అతను ఆ టికెట్టును వెతుక్కుంటూ అదే బస్సులో ఉండిపోయాడు.

అలా 2కిలో మీటర్లు ప్రయాణించిన తర్వాత ప్రయాణికుడికి తన జేబులోనే టికెట్టు దొరికింది. వెంటనే దాన్ని కండక్టర్ కు ఇచ్చి తానిచ్చిన రూ.200 ను తీసుకున్నాడు. తాను దిగాల్సిన స్టాప్ దాటి 2కిలో మీటర్లు ముందుకు రావడంతో.. ఆ ప్రయాణికుడు అక్కడ్నుంచి 2కిలో మీటర్ల దూరంలో ఉన్న బస్ స్టేషన్ కు నడుచుకుంటూ వెళ్లాడు.