
వికారాబాద్ జిల్లా పరిగి బీఆర్ఎస్ లో మరోసారి వర్గపోరు బయటపడింది. పదో తరగతి విద్యార్థులకు డీసీసీబీ ఛైర్మన్ మనోహర్ రెడ్డి ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. అయితే ఈ పంపిణీపై ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వర్గం విమర్శలు గుప్పించింది. ఎమ్మెల్యే వర్గం విమర్శలకు డీసీసీబీ ఛైర్మన్ మనోహర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీలో ఎలాంటి రాజకీయం లేదన్నారు. సోషల్ మీడియాలో పిచ్చి కామెంట్స్ చేసేవారు.. ఇది గమనించాలని చురకలంటించారు.
పరిగిలో తాను ఎక్కడా వ్యాపారాలు చేయడం లేదని, భూ దందాలు, భూ కబ్జాలు చేయలేదంటూ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిపై మనోహర్ రెడ్డి పరోక్ష విమర్శలు చేశారు. బయట తాను వ్యాపారం చేసి, ఆ డబ్బులు నియోజకవర్గంలో ఖర్చు పెడుతున్నానని స్పష్టం చేశారు. బీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాల్లో పుస్తకాల పంపిణీ కూడా ఒకటన్నారు. ప్రజల ఆశీర్వాదం, అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తను సిద్ధమేనని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు.