
పరిగి, వెలుగు : పరిగి మున్సిపాలిటీని సమస్యలు వెంటాడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో మున్సిపల్సేవలు సరిగా అందడం లేదు. అధికారులు ఖర్చులను రికార్డుల వరకే చూపుతూ అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. మున్సిపాలిటీలో ప్రస్తుతం 25 వేల నుంచి 30 వేల మంది జనాభా ఉండగా.. పలు ట్యాక్స్ ల రూపంలో ఏడాది రూ.2 కోట్ల 64 లక్షల ఆదాయం వస్తోంది. ఏడాదికి కోట్లలో ఆదాయం వస్తోన్నా.. జనాలకు అందాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉందని స్థానిక జనం చెబుతున్నారు. ప్రభుత్వం అందజేసిన శానిటేషన్ వెహికల్స్‌ను వాడకుండా మున్సిపల్ సిబ్బంది వాటిని మూలన పడేస్తున్నారు. దీంతో అవితుప్పుపట్టిపోతున్నాయి. ఓ వెహికల్‌ను ఇప్పటికీ బయటకు తీయకుండా ఎంపీడీవో ఆఫీసులోనే ఉంచడంతో అది కరాబైంది. ఇప్పటికైనా ఈ వెహికల్స్‌ను వాడుకలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. 20 రోజుల కిందట మున్సిపాలిటీ సిబ్బంది విధులు సరిగా నిర్వహించకపోవడంతో ఖాన్ కాలనీలో నీటి సమస్య తలెత్తింది. స్థానిక నేత ట్యాంకర్ల ద్వారా మంచినీటిని తెప్పించి కాలనీ వాసులకు అందజేశారు.
రోడ్లు లేవు..
మున్సిపల్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులను విడుదల చేయగా.. వీటన్నింటినీ ఖర్చు చేసినట్లు మున్సిపల్ రికార్డులు చెబుతున్నాయి. కానీ అందుకు తగినట్లు పనులు మాత్రం జరగలేదు. తై బజార్ నిధుల వివరాలు కూడా అసంపూర్ణంగా ఉన్నాయి. మున్సిపాలిటీలో కనీసం రోడ్లను డెవలప్ చేయడంలేదు. కొత్త రోడ్ల నిర్మాణం లేనప్పటికీ ఉన్న వాటిని కూడా పట్టించుకోవడంలేదు. కాలనీల్లో సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల సొంత ఖర్చులతో మట్టి రోడ్డు వేసుకొని అవసరాలు తీర్చుకుంటున్నారు. ఈ సమస్యలపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదు.