![క్రికెట్లో బ్యాట్స్‌మన్ బంతిని మాత్రమే చూసినట్టు.. మీ ఫోకస్ చదువుపైనే ఉండాలె: మోదీ](https://static.v6velugu.com/uploads/2025/02/pariksha-pe-charchapm-modi-addresses-societal-pressure-failure-and-self-relfection_bUsmfIx6XR.jpg)
- 8వ ఎడిషన్ ‘పరీక్షా పే చర్చా’లో విద్యార్థులకు ప్రధాని మోదీ సూచన
- పరీక్షల విషయంలో ప్రెజర్ పెంచుకోవద్దు
- ఫెయిల్యూర్స్ నుంచి పాఠాలు నేర్చుకోవాలి
- పేరెంట్స్ తమ పిల్లలను ఇతరులతో పోల్చవద్దని హితవు
- ఢిల్లీలోని సుందర్ నర్సరీలో 36 మంది స్టూడెంట్లతో ప్రధాని ఇంటరాక్షన్
- దేశవ్యాప్తంగా వర్చువల్ గా పాల్గొన్న 3.56 కోట్ల మంది
న్యూఢిల్లీ: క్రికెట్ స్టేడియంలో ప్రేక్షకులు ఎంత గోల చేస్తున్నా, బ్యాట్స్ మాన్ బంతిపై మాత్రమే ఫోకస్ పెట్టినట్టుగా.. విద్యార్థులు కూడా పరీక్షల విషయంలో ప్రెజర్ ను పట్టించుకోకుండా చదువులపై మాత్రమే ఫోకస్ పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. జీవితంలో ఓటముల నుంచి పాఠాలు నేర్చుకోవాలని, సెల్ఫ్ మోటివేషన్ తో లక్ష్యాల సాధన దిశగా ముందుకు సాగాలన్నారు. పిల్లలను ఇతరులతో పోల్చవద్దని పేరెంట్స్ కు కూడా హితవు పలికారు. 8వ ఎడిషన్ ‘పరీక్షా పే చర్చా–2025’లో భాగంగా సోమవారం ఢిల్లీలోని సుందర్ నర్సరీలో రాష్ట్రాలు, యూటీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సెలక్ట్ అయిన 36 మంది స్టూడెంట్లతో ప్రధాని ముచ్చటించారు. పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలి? లక్ష్యాలను ఎలా సాధించాలి? ప్రెజర్‌ను ఎలా అధిగమించాలి? అన్న విషయాలపై వారికి సూచనలు చేశారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రధాని 2018 నుంచి ఏటా పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ ఆడిటోరియాల్లో మాత్రమే ఈ కార్యక్రమం జరగగా.. ఈసారి పార్కులో నిర్వహించారు. ఈసారి చర్చలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 3.56 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో 19.80 లక్షల మంది టీచర్లు, 5.20 లక్షల మంది పేరెంట్స్ ఉన్నారు.
ప్రెజర్ ను పెంచుకోవద్దు..
పరీక్షల విషయంలో ఒత్తిడిని పెంచుకోకూడదని విద్యార్థులకు ప్రధాని సూచించారు. క్రికెట్ స్టేడియంలో ఒక బ్యాట్స్ మాన్ ఎలా వ్యవహరిస్తాడో ఈ సందర్భంగా ఉదాహరణగా చెప్పారు. ‘‘స్టేడియంలో ప్రేక్షకులు ఎంతో అరిచి గోల చేస్తారు. బౌండరీల కోసం డిమాండ్ చేస్తారు. కానీ బ్యాటర్ అవన్నీ పట్టించుకోడు. అతడికి మాత్రం బంతి మాత్రమే కనిపిస్తుంది. అలాగే విద్యార్థులు కూడా పరీక్షలంటే ఒత్తిడి పెంచుకోవద్దు. ఆ ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి? అని చింతించవద్దు. చదువుపై మాత్రమే కాన్సంట్రేట్ చేయాలి” అని సూచించారు.
ప్రతి ఒక్కరికీ ఉండేది 24 గంటలే..
రోజూ ప్రతి ఒక్కరికీ 24 గంటల సమయమే ఉంటుందని, అయితే కొందరు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మరికొందరు వృథా చేస్తుంటారని ప్రధాని చెప్పారు. రోజువారీగా చేయాల్సిన ముఖ్యమైన పనులను ముందుగానే ఒక పేపర్‌పై రాసుకుని, ఆ ప్లాన్ ప్రకారం పనులను చేసుకుంటూ పోతే సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. కష్టంగా అనిపించే సబ్జెక్టులకే ఎక్కువ టైం కేటాయించాలన్నారు.
గోల్స్ ఇలా సెట్ చేసుకోవాలి..
టెన్త్‌లో తాను 95% మార్కులు సాధించాలని టార్గెట్ పెట్టుకోగా.. 93% మాత్రమే స్కోర్ చేశానని ఓ విద్యార్థిని అసంతృప్తి వ్యక్తంచేయగా.. అది ఓటమి కాదని, విజయమేనని ప్రధాని చెప్పారు. విద్యార్థులు దశల వారీగా సాధించగలిగేలా చిన్న చిన్న గోల్స్ ను సెట్ చేసుకోవాలని సూచించారు. చిన్న చిన్న గోల్స్ పెట్టుకుని, వాటిని సాధిస్తూ పోతే సెల్ఫ్ మోటివేషన్ అందుతుందన్నారు.
ఓటమి నుంచి నేర్చుకోవాలి..
సాధారణంగా టెన్త్, ట్వెల్త్ క్లాస్ లలో 30 నుంచి 40 శాతం మంది స్టూడెంట్లు ఫెయిల్ అవుతుంటారని, కానీ వారు మళ్లీ ప్రయత్నించి విజయం సాధిస్తారని ప్రధాని చెప్పారు. జీవితంలో సక్సెస్ కు, చదువుల్లో సక్సెస్ కు మధ్య ఉన్న తేడాను విద్యార్థులు అర్థం చేసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు ఓటములు, తప్పులను గుర్తించి పాఠాలు నేర్చుకోవాలన్నారు. తమను తాము మెరుగుపర్చుకుని ముందుకు సాగితే విజయం తప్పకుండా వరిస్తుందని తెలిపారు.
పిల్లలను మోడల్స్‌లా చూడొద్దు..
పిల్లలను ఇతరులతో పోల్చవద్దని, వారిని మోడల్స్ లా చూడొద్దని పేరెంట్స్ కు ప్రధాని హితవు పలికారు. పేరెంట్స్ తమ పిల్లల కలలను, బలాలు, బలహీనతలు, సామర్థ్యాలను అర్థం చేసుకుని సపోర్ట్ గా ఉండాలన్నారు. తల్లిదండ్రులు ఎప్పుడూ తమ ఈగోలు, సోషల్ స్టేటస్ లను పిల్లల సక్సెస్ తో ముడిపెట్టవద్దని స్పష్టం చేశారు.