గ్రీస్‌లో ప్రారంభమైన ఒలింపిక్స్ క్రీడలు ఆ తర్వాత అనేక కారణాల వల్ల కనుమరుగయ్యాయి. తిరిగి పీడీ క్యూబర్టీన్ కృషితో నేటి ఆధునిక ఒలింపిక్స్ క్రీడలుగా1896లో ప్రారంభమయ్యాయి. ఇవి ప్రపంచ దేశాల మధ్య శాంతి, స్నేహం పెరగడానికి ఉపయోగపడుతున్నాయి. ప్రపంచ క్రీడాకారులను ఒక వేదిక మీదకు తీసుకువచ్చి వారి ప్రతిభకు పట్టం కట్టే అసలు సిసలైన విశ్వసంబురంగా ఒలింపిక్స్ క్రీడలు భాసిల్లుతూ వస్తున్నాయి. ఈ సారి నిర్వహించే క్రీడలు వచ్చే ఏడాది జులై 26వ తేదీ నుంచి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఘనంగా ప్రారంభం కానున్నాయి.
ఆర్థిక, పర్యావరణ హితంగా..
ఇప్పటికే మూడు సార్లు ఈ క్రీడలు నిర్వహించి లండన్ ఘనత సాధించగా, ఆ తరువాతి రెండో నగరంగా ప్యారిస్ నిలవనుంది. ఇప్పటికే 1900, 1924లో ఒలింపిక్స్‌కు ప్యారిస్ వేదికైంది. 2024లో మూడోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. జులై 26 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు ఈవెంట్స్ జరగనున్నాయి. ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ కు ఒకే రకమైన చిహ్నం రూపొందించుట ఈ ప్యారిస్ ఒలింపిక్స్ ప్రత్యేకత. చరిత్ర తిరగేస్తే, ఏ కార్యక్రమ నిర్వహణకైనా రోజు రోజుకూ ఖర్చు పెరుగుతుంది. దీనికి విరుద్ధంగా, ప్యారిస్‌లో 2024లో జరిగే ఒలింపిక్స్ పోటీలకు భారత కరెన్సీ ప్రకారం రూ.66,146 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. గతంలో టోక్యోలో జరిగిన ఒలింపిక్ క్రీడల వ్యయం రూ.1.25 లక్షల కోట్లతో పోలిస్తే, ప్యారిస్‌లో జరిగే క్రీడలకు ఆ సొమ్ములో సగం మాత్రమే ఖర్చు అవుతుంది. పర్యావరణ హితంగా, ఆర్థిక పరంగా పొదుపు చేస్తూ ఈ క్రీడల నిర్వహిణ నూతన అధ్యాయం లిఖించనుంది. అంతే కాకుండా, ఇప్పటి వరకూ జరిగిన ఒలింపిక్ క్రీడలు ప్రారంభ ఉత్సవం, ముగింపు కార్యక్రమాలు వేదికల వద్ద జరగ్గా, ప్యారిస్‌లో జరిగే ఒలింపిక్ ప్రారంభోత్సవ కార్యక్రమం, ముగింపు కార్యక్రమాలు వేదిక బయట ‘సెన్’ నది ఒడ్డున జరగనున్నాయి. ఒలింపిక్ జ్యోతి సైజ్ కూడా తగ్గించారు.1913లో రూపొందించిన ఒలింపిక్స్ చిహ్నం వైట్ ఫీల్డ్‌పై 5 రింగులు, 5 రంగులు (బ్లూ, బ్లాక్, ఎల్లో, గ్రీన్, రెడ్) 5 ఖండాల దేశాలకు చెందిన క్రీడాకారులు కలిసి పోటీ చేసే విధంగా రూపొందించారు..
క్రీడాకారుల ఎంపికలో నిష్పక్షపాతం అవసరం
వచ్చే ఏడాది ప్యారిస్‌లో జరిగే ఒలింపిక్ క్రీడల్లో సుమారు 206 దేశాలు పాల్గొననున్నాయి. మన దేశం కూడా 2012 నుంచి అనేక క్రీడల్లో పాల్గొంటూ.. ఇటీవల మంచి ప్రతిభ చూపి మెడ ల్స్ సాధిస్తూ ముందుకు సాగుతోంది. తాజాగా ఢిల్లీలో మహిళా అథ్లెటిక్స్ చేసిన నిరసనలు దేశవ్యాప్తంగా అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వాలు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి, దోషులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఏర్పడింది. క్రీడాకారుల ప్రతిభకు పాతర వేయకూడదు. వివిధ క్రీడా కమిటీ సభ్యులను, ఛైర్మన్ లను సంబంధిత క్రీడల్లో నైపుణ్యం ఉన్న వారినే నియమించాలి. ముఖ్యంగా మహిళా క్రీడాకారిణులకు రక్షణ, భద్రత కల్పించుట ద్వారా మరెన్నో పతకాలు సాధించే అవకాశం ఉంటుంది. గిరిజన, వెనుకబడిన వర్గాల క్రీడాకారులను
మరింత ప్రోత్సహించాలి.
భారత్‌కు మరిన్ని పతకాలు ఖాయం..
మేధావులు తమ జీవిత లక్ష్యం ‘నోబెల్’ బహుమతి కోసం ఎలా ఎదురు చూస్తారో, అలాగే, ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల క్రీడాకారుల లక్ష్యం, తపన ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు సాధించేడమే. విజయమే ధ్యేయంగా వారు తుది వరకు పోరాడుతారు. ఈసారి గతం కన్నా భారత్ మరిన్ని విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. గత టోక్యో ఒలింపిక్స్ క్రీడలను కరోనా భయపెట్టగా, నేడు ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడలను ఆ దేశంలో జరుగుతున్న ఆందోళనలు వెంటాడుతున్నాయి. ఏది ఏమైనా, నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ విశ్వ క్రీడలు మంచి వాతావరణంలో శాంతి, స్నేహపూర్వకంగా జరగాలని, నిజమైన క్రీడాస్ఫూరికి చిహ్నంగా నిలవాలని, భారత్‌కు మరిన్ని పతకాలు రావాలని కోరుకుందాం.
- ఐ. ప్రసాదరావు,
సోషల్ ఎనలిస్ట్