
ఈ ఒలింపిక్స్ ఇండియాకు మూడు మెడల్స్ అందించిన షూటింగ్‌లో దేశానికి మరో పతకం కొద్దిలో చేజారింది. స్కీట్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మహేశ్వరి చౌహాన్–అనంత్ జీత్ సింగ్ నరూక కాంస్య పతక పోరులో పరాజయం పాలై నాలుగో స్థానంతో సరిపెట్టారు. ఉత్కంఠగా సాగిన కాంస్య పతక మ్యాచ్‌లో ఇండియా జోడీ 43 స్కోరు చేయగా..చైనా జంట యిటింగ్ జియాంగ్–జైన్లిన్ ల్యూ 44 స్కోరుతో మెడల్ గెలిచింది. ఈ పోరులో అద్భుతంగా ఆడిన ల్యూ ఒక్క షాట్‌ను కూడా మిస్ చేయకపోవడంతో చైనాను పతకం వరించింది. ట్రాప్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో ఇద్దరు షూటర్లకు నాలుగేసి టార్గెట్ల చొప్పున ఆరు సిరీస్‌ల పోటీ నిర్వహించారు. తొలి సిరీస్‌లో చైనా షూటర్లు నాలుగు టార్గెట్లనూ షూట్ చేశారు. ప్రతిగా అనంత్ ఒక టార్గెట్‌ను మిస్ చేసి 3/4తో నిలవగా.. మహేశ్వరి మాత్రం 4/4తో శుభారంభం చేసింది.
తొలి సిరీస్ తర్వాత చైనా 8/8, ఇండియా 7/8తో నిలిచాయి. రెండో సిరీస్‌లో ఇండియా షూటర్లు చెరోసారి మిస్ పైర్ అవ్వగా.. జియాంగ్ వరుసగా మూడు షాట్లను మిస్ చేయడం వారికి కలిసొచ్చింది. మూడో సిరీస్‌లోనూ జియాంగ్ ఒక షాట్‌ను తప్పగా.. ల్యూ మాత్రం గురి తప్పకుండా దూసుకెళ్లింది. దాంతో, మూడు సిరీస్ ల తర్వాత ఇరు జట్లూ 20–20 స్కోర్లతో సమంగా నిలిచాయి. తర్వాతి రెండు సిరీస్‌ల్లో చైనా షూటర్లు 8/8 స్కోర్లు సాధించగా.. నాలుగో సిరీస్‌లో మహేశ్వరి ఓ టార్గెట్‌ను మిస్ అవ్వడం ఇండియాను దెబ్బతీసింది. ఒక పాయింట్ వెనుకంజలో నిలిచిన ఇండియా షూటర్లు 5, 6వ సిరీస్‌ల్లోనూ 8/8 స్కోర్లతో సత్తా చాటారు. చివరి రెండు సిరీస్‌ల్లో చైనా షూటర్ల తప్పిదం కోసం ఆశగా ఎదురు చూశారు. కానీ, ఈ రెండు సిరీస్‌ల్లోనూ చైనా షూటర్లు అన్ని టార్గెట్లను గురి చూసి కొట్టడంతో ఆ జట్టే పతకం సొంతం చేసుకోగా.. ఇండియాకు నిరాశ తప్పలేదు. అంతకుముందు క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఇండియా 146 స్కోరుతో నాలుగో స్థానంతో కాంస్య పోరుకు అర్హత సాధించింది.