
పారిస్: ఈ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ ఈవెంట్లకే హైలైట్‌గా నిలిచిన 100 మీ. రన్‌లో చాంపియన్‌గా నిలిచిన అమెరికా స్ర్పింటర్ నోవా లైల్స్‌కు 200 మీటర్ల ఈవెంట్‌లో షాక్ తగిలింది. కరోనా బారిన పడిన అతను ఈ పోటీలో మూడో స్థానంతో కాంస్యం పతకంతో సరిపెట్టాడు. వరల్డ్ క్లాస్ రన్నర్లను పేరుగాంచిన సౌత్ ఆఫ్రికా ఖండంలోని బోత్స్వానా దేశానికి చెందిన లెట్సిలే టెబెగో ఈ పోటీలో విజేతగా నిలిచి సంచలనం సృష్టించాడు.
గురువారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో 21 ఏండ్ల లెట్సిలే 19.46 సెకండ్లలోనే రేసును పూర్తి చేసి బంగారు పతకం గెలిచాడు. దాంతో ఈ ఈవెంట్‌లో చాంపియన్‌గా నిలిచిన తొలి అఫ్రికా అథ్లెట్‌గా రికార్డు సాధించాడు. అమెరికా అథ్లెట్ కెన్నెత్ బెడ్నారెక్ 19.62 సెకండలో రెండో స్థానంతో రజతం గెలవగా, మూడు సార్లు వరల్డ్ చాంపియన్ అయిన లైల్స్ 19.70 టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నాడు. మాస్కుతో ట్రాక్‌పైకి వచ్చిన లైల్స్ రేసు పూర్తయిన తర్వాత కిందపడిపోవడంతో స్టేడియంలో ఒక్కసారిగా ఆందోళన కలిగింది. మెడికల్ స్టాఫ్ చికిత్స అందించి అతడిని వీల్‌చైర్‌పై బయటికి తీసుకెళ్లారు. అప్పుడే తాను కరోనా బారిన పడిన విషయాన్ని లైల్స్ వెల్లడించాడు.