
పారిస్ : ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన ఇండియా ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. శుక్రవారం జరిగిన కాంస్య పతక ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లో బొమ్మదేవర ధీరజ్–అంకితా భాకట్‌తో కూడిన ఇండియా ద్వయం 2–6 (37–38, 35–37, 38–34, 35–37)తో వరల్డ్ నంబర్‌వన్ జోడీ క్యాసీ కుఫెల్డ్–ఎలిసన్ బ్రాడీ (అమెరికా) చేతిలో ఓడింది.
దీంతో పతకం కోసం 36 ఏండ్లుగా చేస్తున్న పోరాటం మరోసారి ఫలించలేదు. అంతకుముందు మెగా గేమ్స్‌లో తొలిసారి సెమీస్ చేరిన ఆర్చరీ జట్టుగా ఇండియా రికార్డు సృష్టించింది. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో ఇండియన్ ఆర్చర్లకు మెరుగైన ఆరంభం దక్కలేదు. తీవ్ర ఒత్తిడికి లోనైన అంకిత నాలుగు సెట్లలో కలిపి రెండుసార్లు 7, రెండుసార్లు 10 పాయింట్లు మాత్రమే స్కోరు చేయడం బాగా దెబ్బతీసింది. దాంతో 0–4తో మూడో సెట్ మొదలుపెట్టిన ఇండియా ఆర్చర్లు రెండు 10/10తో 38 పాయింట్లు తెచ్చారు.
యూఎస్ 34 పాయింట్లకే పరిమితం కావడంతో 2–4తో ధీరజ్, అంకిత రేసులో నిలిచారు. కానీ కీలకమైన నాలుగో సెట్‌లో అంకిత రెండుసార్లు 8, ధీరజ్ కూడా 9, 10 పాయింట్లే సాధించడంతో 35 వచ్చాయి. కానీ 37 పాయింట్లు నెగ్గిన యూఎస్ జట్టు 6–2 స్కోరుతో మెడల్‌ను సొంతం చేసుకుంది. అంతకుముందు సెమీస్‌లో ఇండియా 2–6తో కొరియా చేతిలో ఓడింది. క్వార్టర్స్‌లో 5–3తో స్పెయిన్‌పై గెలిచింది.