
- కాంస్య పోరు ముందు భారీగా బరువు పెరిగిన అమన్
- రాత్రంతా కష్టపడి వెయిట్ తగ్గించుకున్న యువ రెజ్లర్
పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియాకు వచ్చిన ఆరో, చివరి పతకం అనూహ్యం. అంచనాలే లేకుండా బరిలోకి వచ్చిన యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్యం ‘పట్టు’కొచ్చాడు. భారీ అంచనాలున్న వినేశ్ ఫొగాట్ స్వర్ణ పతకంపై ఆశలు రేపినా.. వంద గ్రాముల బరువు పెరిగిన కారణంగా అనర్హతకు గురవడంతో చేజారిన పతకం అమన్ రూపంలో తిరిగి ఇండియా ఖాతాలో చేరింది. అయితే, అమన్ సైతం వినేశ్ లాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. సెమీఫైనల్ తర్వాత ఏకంగా నాలుగున్నర కిలోల బరువు పెరిగాడు. కానీ, రాత్రంతా మేల్కొని పది గంటలు కష్టపడి 4.6 కిలోలుతగ్గించుకున్నాడు. ఫలితంగా ఇండియాకు మరో గుండెకోతను తప్పించి పతకం అందించాడు.
పారిస్: మనం ఏదైనా సాధించాలంటే .. ముందుగా ఏదైనా కోల్పోవడానికి సిద్ధపడాలి. నిజ జీవితంలో కంటే ఆటల్లోనూ దీనికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఇండియా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ 100 గ్రాముల బరువును తగ్గించుకోలేక ఫైనల్ బౌట్ నుంచి అనర్హతకు గురైంది. చేతుల్లోకి వచ్చిన ఒలింపిక్ పతకం కోల్పోయిన బాధలో తను రెజ్లింగ్‌కే వీడ్కోలు పలికింది. ఈ మెగా గేమ్స్ రెజ్లింగ్‌లో ఇండియాకు ఏకైక పతకంగా కాంస్యం అందించిన యంగ్‌స్టర్ అమన్ సెహ్రావత్‌కు కూడా వినేశ్ పరిస్థితే ఎదురైంది. ఈ పతక మ్యాచ్‌కు ముందు అతను ఏకంగా 4.5 కేజీల బరువు పెరిగాడు. అయితే పది గంట్లల్లోనే ఆ బరువునంతా తగ్గించుకున్న అమన్ 57 కేజీ బౌట్ కాంస్య పతక పోటీలో నిలిచి గెలిచాడు. దాంతో అమన్ తన తొలి ఒలింపిక్స్‌లోనే పతక కల నెరవేర్చుకున్నాడు. ఇందు కోసం బౌట్ ముందు రోజు
అతను ఓ యుద్ధమే చేశాడు.
మిషన్ వెయిట్ లాస్..
గురువారం వరుసగా రెండు బౌట్లలో మేటి ప్రత్యర్థులను ఓడించిన తర్వాత సెమీఫైనల్లో ఓడిన అమన్ కాంస్య పతక పోరుకు అర్హత సాధించాడు. ఆ బౌట్ తర్వాత బరువు కొలవగా.. 61.5 కిలోలు ఉన్నట్టు తేలింది. అంటే అతను పోటీ పడే (57 కేజీ) కేటగిరీ కంటే నాలుగున్నర కిలోలు ఎక్కువ. వినేశ్ తాను పెరిగిన రెండున్నర కిలోలనే తగ్గించుకోలేక అనర్హతకు గురవగా.. అమన్ అంతకు రెట్టింపు బరువు పెరగడంతో అతని కోచ్‌లు, ఇండియా రెజ్లింగ్ శిబిరంలో గుబులు రేగింది. అంతే, అమన్, అతని కోచ్‌లు జగ్మేందర్ సింగ్, వీరేందర్ దహియా క్షణం ఆలస్యం చేయకుండా వెయిట్ లాస్ మిషన్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ముందుగా అమన్ గంటన్నర పాటు మ్యాట్ సెషన్‌లో పాల్గొన్నాడు. తొలుత షాడో రెజ్లింగ్ చేసిన ఇండియా కుర్రాడు తర్వాత కోచ్‌లతో కలిసి కుస్తీ పట్టి చెమటలు చిందించాడు. ఆ తర్వాత గంటర్నర పాటు హాట్ వాటర్ బాత్ సెషన్ లో పాల్గొన్నాడు. అప్పటికి రాత్రి 12 దాటిపోయింది.
ఉదయం 4.30 గంటలకు నిర్ణీత బరువులోకి
అర్ధరాత్రి 12.30 గంటలకు జిమ్‌లోకి వచ్చి గంటపాటు ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేశాడు. 30 నిమిషాల బ్రేక్ తీసుకున్న అమన్ శరీరంలోని నీటిని బయటికి పంపేందుకు ఐదు సెషన్ల పాటు ఆవిరి స్నానం చేశాడు. ఇలా అన్ని సెషన్లు పూర్తయిన తర్వాత కూడా సెహ్రావత్ 900 గ్రాముల అధికంగా ఉండటంతో ఆందోళన తగ్గలేదు. దాంతో కోచ్‌లు అతనితో తేలికపాటి జాగింగ్ చేయించారు. ఆ తర్వాత 15 నిమిషాల చొప్పున ఐదుసార్లు రన్నింగ్ సెషన్స్ నిర్వహించారు. అప్పటికి తెల్లవారు జాము 4.30 గంటలు అయింది. అప్పుడు బరువు కొలవగా అమన్ 56.9 కేజీలు ఉన్నాడు. నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు తక్కువ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ అమన్‌రాత్రంతా మేల్కోవాల్సి వచ్చింది. ఎలాంటి ఆహారం తీసుకోలేదు. ఆయా సెషన్ల మధ్యలో శక్తి కోసం నిమ్మరసం, తేనె కలిపిన గోరు వెచ్చటి నీళ్లు, కొంచెం కాఫీ మాత్రమే ఇచ్చారు. ‘మేము రాత్రే కాదు పగలు కూడా నిద్రపోలేదు. ప్రతీ గంటకోసారి అమన్ బరువు కొలిచాం. వెయిట్ కటింగ్ అనేది రొటీన్. మాకు మామూలే. కానీ వినేశ్ ఎపిసోడ్ వల్ల చాలా టెన్షన్ పడ్డం. మరో పతకాన్ని జారవిడుచుకోవద్దని కష్టపడ్డాం’ అని దహియా చెప్పాడు. ఈ కష్టం వృథా పోలేదు. ప్యూర్టోరికా రెజ్లర్ డారియన్ క్రూజ్‌ను చిత్తు చేసిన అమన్.. ఒలింపిక్ పతకం నెగ్గిన ఇండియా యంగెస్ట్ అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు.
మ్యాట్‌పై కుస్తీ పట్టడం కంటే బరువు తగ్గించుకోవడమే కష్టమైన పని. ఆటలో ఇంతగా శక్తిని ధారపోయాల్సిన అవసరం ఉండదు. సెమీస్ గెలిచిన తర్వాత పెరిగిన బరువు తగ్గించుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. రాత్రంతా మేల్కొని ఉదయం బరువు చూసుకున్న తర్వాత ఒక యుద్ధం గెలిచి.. మరో యుద్ధానికి సిద్ధమైన భావన కలిగించింది. ఇంత కష్టపడి గెలిచిన ఈ పతకాన్ని నా తల్లిదండ్రులు, దేశ ప్రజలకు అంకితం ఇస్తున్నా. ఈ విజయంతో నా జీవితం ఏమీ మారదు. నా తీరు మారదు. ఇప్పుడు ఎలా ఉన్నానో.. ఇకపైనా అలానే ఉంటా. కాకపోతే ఈసారి కాంస్యం గెలిచా.. వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవాలని అనుకుంటున్నా.