
అనర్హత వేటును సవాల్ చేస్తూ భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ దాఖలు చేసిన పిటిషన్‌పై శనివారం(ఆగష్టు 10) తుది నిర్ణయం వెలువడనుంది. పారిస్ కాలమానం ప్రకారం, శనివారం సాయంత్రం 18:00 (భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30) గంటలలోపు తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఈ మేరకు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ (CAS) తుది గడువును వెల్లడించింది.
సాధారణంగా, తీర్పు ఇవ్వడానికి తాత్కాలిక ప్యానెల్‌కు 24 గంటల సమయ పరిమితి ఇవ్వబడుతుంది. అయితే, తాజా అప్‌డేట్ ప్రకారం ఆ సమయాన్ని మరికొన్ని గంటలు పొడిగించారు.
ALSO READ | Vinesh Phogat: ఆమె చేతుల్లోనే వినేశ్ ఫోగాట్ భవితవ్యం.. ఎవరీ అన్నాబెల్లె బెన్నెట్..?
కాగా, వినేష్ ఫోగాట్ కేసులో CAS తీర్పుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) కట్టుబడి ఉంటుందని అధ్యక్షుడు థామస్ బాచ్ ఇప్పటికే ధృవీకరించారు. దాంతో, ఏ తీర్పు వస్తుందోనని భారత అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తీర్పు వినేశ్‌కు అనుకూలంగా వస్తుందన్న ఆశాభావాన్ని భారత ఒలింపిక్ సంఘం వ్యక్తం చేసింది.
వాదోపవాదనలు
అంతకుముందు కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ (CAS) ఎదుట వినేశ్ ఫోగాట్ తరుపున ఫ్రాన్స్ న్యాయవాదులు, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తరపున హరీశ్ సాల్వే, విధుష్పత్ సింఘానియా గంటపాటు తమ వాదనలు వినిపించారు. శరీరం సహజంగా కోలుకునే ప్రక్రియ వల్లనే మంగళవారం సాయంత్రం బరువు పెరిగిందని, శరీరాన్ని చూసుకోవడం అథ్లెట్ ప్రాథమిక హక్కు అని వారు వాదించారు. పోటీలు ప్రారంభమైన మొదటి రోజు ఆమె శరీర బరువు నిర్దేశించబడిన పరిమితిలో ఉందని వారు వాదించారు. బరువు పెరగడం అనేది కేవలం కోలుకోవడం వల్ల మాత్రమే జరిగిందని, అది మోసం కాదని CAS దృష్టికి వారు తీసుకెళ్లారు.