
సెయింట్ డెనిస్ (ఫ్రాన్స్): పారిస్ ఒలింపిక్స్‌లో చైనా బంగారు పతకాల వేటలో దూసుకెళ్తోంది. అమెరికా వంద పతకాలు దాటి సెంచరీ కొట్టగా.. చైనా ఇప్పటికే 37 గోల్డ్ మెడల్స్‌తో టాప్ ప్లేస్‌లో నిలిచింది. చైనా సాధించిన బంగారు పతకాల్లో అత్యధికంగా ఎనిమిది డైవింగ్ స్పోర్ట్ నుంచే వచ్చాయి. ఈ ఆటలో పూర్తి ఆధిపత్యం చూపెట్టిన చైనీయులు... డైవింగ్‌లో ఎనిమిది ఈవెంట్లలోనూ స్వర్ణ పతకాలు సాధించి క్లీన్‌స్వీప్ చేశారు. శనివారం జరిగిన చివరి డైవింగ్ ఈవెంట్ అయిన మెన్స్ 10 మీటర్ల ప్లాట్‌ఫార్మ్‌లో కవో యువాన్ 547.50 స్కోరుతో అగ్రస్థానంతో చైనాకు ఎనిమిదో స్వర్ణం అందించాడు.
ఈ పోటీలో అతను వరుసగా రెండోసారి బంగారు పతకం గెలిచాడు. 3 మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్, 10 మీటర్ల ప్లాట్‌ఫార్మ్, సింక్రనైజ్డ్ 3 మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్, సింక్రనైజ్డ్ 10 మీటర్ల ప్లాట్‌ఫార్మ్‌లో అమ్మాయిల, అబ్బాయిల పోటీల్లో చైనానే స్వర్ణాలు గెలుకుంది. మరో రెండు రజతాలు, ఓ కాంస్యం కూడా సాధించడంతో డైవింగ్‌లో చైనా మొత్తంగా 11 పతకాలు గెలిచింది. 2008 ఒలింపిక్స్ నుంచి డైవింగ్ పోటీల్లో చైనా 40 స్వర్ణ పతకాలకు గాను 35 గెలవడం విశేషం.