దాదాపు మూడు వారాల పాటు అభిమానులను అలరించిన పారిస్ ఒలింపిక్స్ గేమ్స్ నేటి అర్ధరాత్రితో(ఆగష్టు 11న) ముగియనున్నాయి. ఈ విశ్వక్రీడల్లో కొందరు క్రీడాకారుల నైపుణ్యానికి అదృష్టం తోడై పతకాన్ని ముద్దాడితే, మరికొందరిని దురదృష్టం వెంటాడి నిరాశతో వెనుదిరిగారు. ఇప్పటివరకూ జరిగిన పోటీల్లో 39 పసిడి పతకాలతో(మొత్తం 90 మెడల్స్) చైనా అగ్రస్థానంలో ఉండగా.. 38 స్వర్ణాల(మొత్తం 122 మెడల్స్)తో అమెరికా రెండో స్థానంలో ఉంది.
117 మంది అథ్లెట్లతో పారిస్ గడ్డపై అడుగుపెట్టిన భారత దేశం 6 పతకాలతో సరిపెట్టుకుంది. అయితే, అదృష్టం కలిసిరాక నాలుగో స్థానంతో ఏడు పతకాలు కోల్పోయింది మన దేశం. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో దేశనికి 7 పతకాలు రాగా.. ఈసారి ఒకటి ఒక పతకం తక్కువ వచ్చింది. కానీ, విశ్వవేదికపై భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేసి దేశప్రజల హృదయాలను గెలుచుకున్నారు. వీరిలో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు జరిగిన అన్యాయం ఒకటి. నిబంధనల ప్రకారం, ఆమెపై అనర్హత వేటు సమంజసమే అయినప్పటికీ,.. బరువు అనేది శరీరానికి సంబంధించినది కనుక మానవతా కోణంలో చూడాల్సిన అవసరమూ ఉందన్న మాటలు వినపడుతున్నాయి.
భారత పతక విజేతలు
పారిస్ విశ్వక్రీడల్లో మన దేశానికి 6 పతకాలు వచ్చాయి. ఇందులో ఒకటి రజతం కాగా, మిగిలిన ఐదు కాంస్య పతకాలు. ఈ ఐదింటిలో మూడు కాంస్యాలు షూటింగ్‌లో వచ్చినవే. మరోకటి పురుషుల హాకీ జట్టు సాధించగా, ఇంకొకటి రెజ్లింగ్‌లో వచ్చింది. రజత పతకాన్ని జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా గెలిచాడు. పారిస్ ఒలింపిక్స్‌లో ఇప్పటివరకూ మన దేశానికి ఇదే అత్యుత్తమ మెడల్.
ముగింపు వేడుకలు
పారిస్ ఒలింపిక్స్ 2024 ముగింపు వేడుకలు సోమవారం తెల్లవారుజామున 12:30 గంటలకు ప్రారంభమవుతాయి. ముగింపు వేడుకలనేవి దేశాల జెండాల పరేడ్‌తో మొదలవుతుంది. ఇందులో వివిధ దేశాల నుండి అథ్లెట్లు తమ జెండాతో స్టేడియం వరకు నడుస్తారు. భారతదేశం తరపున షూటర్ మను భాకర్, హాకీ జట్టు గోల్ కీపర్ శ్రీజేష్ ఫ్లాగ్ బేరర్లుగా పాల్గొననున్నారు.
తదుపరి ఒలింపిక్ క్రీడలు ఇటలీ వేదికగా జరగనున్నాయి. 2026 వింటర్ ఒలింపిక్స్ క్రీడలకు మిలన్ కోర్టినా డి'అంపెజ్జో నగరం అతిథ్యమివ్వనుంది. అనంతరం 2028లో జరిగే సమ్మర్ ఒలింపిక్స్‌కు లాస్ ఏంజెల్స్(los Angeles) వేదిక కానుంది. ఈ విశ్వక్రీడల్లో క్రికెట్ పోటీలు జరగనున్నాయి.