
- 10 మీ. పిస్టల్ మిక్స్‌డ్ టీమ్‌లో సరబ్‌జోత్‌తో కాంస్య పోరుకు అర్హత
- మెన్స్ రైఫిల్‌లో కొద్దిలో బ్రాంజ్ మెడల్ చేజార్చుకున్న అర్జున్
- నిరాశ పరిచిన రమిత, రిథమ్–చీమా
చటౌరాక్స్ (పారిస్): ఇండియా స్టార్ షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో అదరగొడుతోంది. కాంస్య పతకంతో ఇండియా ఖాతా తెరిచిన భాకర్ మరో మెడల్ ముంగిట నిలిచింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి భాకర్ బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. సోమవారం జరిగిన 10 మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ ఎలిమినేషన్ రౌండ్‌లో భాకర్, సరబ్‌జోత్ మొత్తంగా 580 స్కోరుతో మెడల్ రౌండ్‌కు క్వాలిఫై అయ్యారు. ఈ పోటీలో మను తనదైన శైలిలో మెప్పించింది. తొలి రెండు సిరీస్‌ల్లో 98 స్కోర్లతో ఆకట్టుకుంది. కానీ, మూడో సిరీస్‌లో 95 స్కోరు మాత్రమే చేయడంతో ఇండియా గోల్డ్ మెడల్ మ్యాచ్‌కు అర్హత సాధించలేకపోయింది. సరబ్ జోత్ తొలి సిరీస్‌లో 95, రెండు, మూడో సిరీస్‌ల్లో 97 స్కోర్లు చేశాడు. 579 స్కోరు సాధించిన కొరియా జంట ఒహ్ యె జిన్–లీ వొన్షోతో మంగళవారం జరిగే కాంస్య పతక పోరులో మను, సరబ్‌జోత్ పోటీ పడనున్నారు. ఒలింపిక్ రికార్డు స్కోరుతో టర్కీ (582), సెర్బియా (581) తొలి రెండు స్థానాలతో బంగారు పతక పోరుకు అర్హత సాధించాయి. ఇదే ఈవెంట్‌లో మరో ఇండియా జోడీ రిథమ్ సాంగ్వాన్–అర్జున్ సింగ్ చీమీ 576 స్కోరుతో పదో స్థానంతో నిరాశ పరిచింది.
రమితకు నిరాశ
విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో 20 ఏండ్ల రమిత జిందాల్ ఒత్తిడిలో తడబడింది. ఎనిమిది మంది బలమైన షూటర్లు బరిలో నిలిచిన తుదిపోరులో ఓ దశలో నాలుగో స్థానంలో నిలిచిన రమిత ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది. మొత్తంగా 145.3 పాయింట్లు సాధించింది. 10 షాట్ల తర్వాత ఎలిమినేషన్ మొదలైనప్పుడు ఆమె 104 పాయింట్లతో ఏడో స్థానంతో నిలిచింది. ఎలిమినేషనల్ ప్రమాదంలోకి వచ్చిన సమయంలో రమిత 10.5 పాయింట్ల షాట్‌తో ఆరో ప్లేస్‌కు రాగా.. నార్వే షూటర్ హెగ్ వైదొలిగింది. కానీ, ఆ తర్వాత రమిత పతక రేసులో నిలవలేకపోయింది. కాగా, మెన్స్ ట్రాప్ పోటీల్లో ఇండియా షాట్‌గన్ షూటర్ పృథ్వీరాజ్ తొలి రోజు మూడు క్వాలిఫికేషన్ రౌండ్లు ముగిసిన తర్వాత 30వ స్థానంలో నిలిచాడు. ప్రతీ రౌండ్‌లో 25 షాట్లు ఉండగా పృథ్వీ 75కు గాను 65 స్కోరుతో కొనసాగుతున్నాడు. మంగళవారం మరో రెండు క్వాలిఫికేషన్ రౌండ్ల తర్వాత టాప్–6లో నిలిచిన షూటర్లు ఫైనల్‌కు క్వాలిఫై అవుతారు.
పారిస్ గేమ్స్‌లో షూటర్ మను భాకర్ హవా నడుస్తోంది. ఈ ఒలింపిక్స్‌లో ఇండియాకు తొలి మెడల్ అందించిన మను మూడో రోజు తన గురితో మెప్పించింది. విశ్వక్రీడల్లో రెండో పతకం నెగ్గిన ఇండియా షూటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించేందుకు చేరువైంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మను, సరబ్‌జోత్ జంట కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటర్ అర్జున్ బబూట నాలుగో స్థానంలో నిలిచి కొద్దిలో బ్రాంజ్ మెడల్ చేజార్చుకున్నాడు. ఇతర షూటర్లు నిరాశ పరచగా.. బ్యాడ్మింటన్‌లో డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఇండియా హాకీ టీమ్.. అర్జెంటీనాతో పోరులో ఓటమి తప్పించుకొని డ్రాతో గట్టెక్కగా... టెన్నిస్ లెజెండ్ రోహన్ బోపన్న డబుల్స్‌లో శ్రీరామ్ బాలాజీతో కలిసి తొలి రౌండ్‌లోనే ఓడి మెడల్ లేకుండానే తన ఒలింపిక్ కెరీర్‌ను ముగించాడు. మొత్తంగా మూడో రోజు పతకం రాకపోయిన మను భాకర్ మెరుపులతో కాస్త ఊరట దక్కింది.