Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌.. సెమీస్ చేరిన భారత హాకీ జట్టు

పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం(ఆగష్టు 4) జరిగిన క్వార్టర్‌ఫైనల్లో భారత జట్టు.. ప్రపంచ నంబర్‌-2 బ్రిటన్‌ను ఓడించి సెమీస్‌‌లో అడుగుపెట్టింది. మొదట ఇరు జట్ల గోల్స్ 1-1 తో సమం కావడంతో.. మ్యాచ్ టై అయింది. దాంతో, ఫలితం పెనాల్టీ షూటౌట్‌‌కు దారి తీరింది. 

టైబ్రేకర్‌లో భారత్ 4-2తో విజయం సాధించింది. షూటౌట్‌లో నలుగురు భారత ఆటగాళ్లు గోల్ చేయగా, గ్రేట్ బ్రిటన్ రెండుసార్లు తప్పిపోయింది. భారత గోల్ కీపర్ శ్రీజేష్  శాయశక్తులు ఒడ్డి బ్రిటన్‌ను గోల్స్ చేయకుండా అడ్డుకున్నాడు.

10 మందితోనే భారత జట్టు

తొలి క్వార్టర్‌లో ఇరుజట్లు గోల్ చేయలేదు. అనంతరం రెండో క్వార్టర్‌ ఆరంభమైన కొద్దిసేపటికే భారత డిఫెండర్‌ అమిత్‌ రోహిదాస్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడు. హాకీ స్టిక్‌తో బ్రిటన్ ఆటగాడి తలపై ఉద్దేశపూర్వకంగా కొట్టాడని భావించిన రిఫరీలు అతనికి రెడ్‌కార్డ్ చూపెట్టారు. దాంతో, అతను బయటికి వెళ్ళిపోయాడు. అనంతరం భారత జట్టు 10 మందితోనే ఆటను కొనసాగించింది. అలా మెన్ ఇన్ బ్లూమ్యాచ్‌లో ఎక్కువ భాగం 10 మందితోనే ఆడినప్పటికీ, బ్రిటీష్ జట్టును 1-1 డ్రాగా నిలిపి, గేమ్‌ను పెనాల్టీ షూటౌట్‌లోకి తీసుకువెళ్లింది.